కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలం విరాళంగా ఇచ్చిన టి.జి.వి సంస్థలు
కర్నూలు టౌన్ :
ఆర్యవైశ్యుల పిల్లలు ఉన్నత చదువులు చదివేందు కోసం మాజీ ఎంపీ, టీజీవీ సంస్థల ఛైర్మన్ టి.జి వెంకటేష్ భారీ విరాళం ప్రకటించారు. కర్నూలు నగరంలో కోట్లాది రూపాయలు విలువ చేసే 88 సెంట్ల స్థలం, భవనాన్ని వాసవీ సత్రం సమూదాయానికి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని మౌర్య ఇన్‌లోని ఆయన ఛాంబర్లో సదరు స్థలాన్ని వాసవీ సత్రం సమూదాయానికి రిజిస్ట్రేషన్ చేయించి దానికి సంబంధించిన డాక్యుమెంట్లను టి.జి వెంకేటష్, ఆయన కుమారుడు టి.జి భరత్‌లు సదరు కమిటీ సబ్యులకు అందజేశారు. ఆర్యవైశ్యుల్లో ఉన్నత చదువులు చదువుకునే ఎంతో మంది విద్యార్థులకు వసతి కల్పించడం కోసం దీన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా టి.జి వెంకటేష్ అన్నారు. ఆర్యవైశ్యులకు ఎప్పుడూ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం వాసవీ సత్ర సమూదాయాల అధ్యక్షుడు దేవకీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆర్యవైశ్య విద్యార్థులకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నగరంలోని నంద్యాల చెక్ పోస్టులో ఉన్న కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంతో పాటు భవనాన్ని ఉచితంగా ఇచ్చినందుకు టి.జి కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్యవైశ్యులకు ఏ అవసరం వచ్చినా వెంటనే సహాయం చేయడం టి.జి వెంకటేష్‌కే చెల్లిందన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి సత్ర సముదాయం అధ్యక్షుడు దేవతి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఉప్పల భరతయ్య, కోశాధికారి కోటేశ్వర రావు, కార్యనిర్వాహక కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.