ఆత్మకూరులో అఖండ విజయం సాధించిన వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి
డిపాజిట్ కోల్పోయిన బిజెపి. వైఎస్ఆర్ సీపి కి 1,02,240 ఓట్లు. బిజెపి కి 19,352 ఓట్లు..
వైఎస్ఆర్ సిపి మెజారిటీ 82,888 ఓట్లు.
ఏకపక్షంగా గెలుపు సాధించిన వైఎస్ఆర్ సీపీ. కనీసం 20 వేలు ఓట్లు దాటలేకపోయిన బిజెపి
నెల్లూరు /ఆత్మకూరు, జూన్ 26, (సీమకిరణం న్యూస్):
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ పార్టీ అఖండ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. ఇక, పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్ రెడ్డి చిత్తుగా ఓడించారు. ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. రౌండ్లు ముగుస్తున్న కొద్దీ ఆధిక్యాన్ని పెంచుకున్నారు. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్.. విక్రమ్ రెడ్డికి ఏ మాత్రం పోటీనివ‍్వలేదు. ఇక, పోస్టల్ బాలెట్‌లో 205 ఓట్లకు గానూ వైఎస్సార్‌సీపీకి 167 ఓట్లు వచ్చాయి. దీంతో, బ్యాలెట్ ఓట్లలోనూ వైఎస్సార్‌సీపీ భారీ ఆధిక్యం సాధించింది. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్ రెడ్డి కి 1,02,240 ఓట్లు, బిజెపి అభ్యర్థి భరత్ కుమార్ కు 19,352 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో వైఎస్ఆర్ సీపీ 82,888 భారీ మెజారిటీ సాధించింది.బిజెపి డిపాజిట్ కోల్పోడంతోపాటు ఘోర పరాభవం మూట కట్టుకుంది. ఆత్మకూరు లో వైఎస్ఆర్ సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు అఖండ మెజారిటీతో విజయం సాధించిన మేకపాటి విక్రమ్ రెడ్డి ని పలువురు ప్రముఖులు అభినందించారు.
కాగా, రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి భారీ మెజార్టీ విజయాన్ని అందుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మేకపాటి విక్రమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. మా కుటుంబంపై నమ్మకం ఉంచినందుకు ధన్యావాదాలు. గౌతమ్ అన్న పేరు నిలబెడతాను. ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలే నా గెలుపునకు కారణం’’ అని అన్నారు.అనంతరం.. మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ తగ్గలేదు. సీఎం జగన్ అమలుచేస్తున్న నవరత్నాలే విజయానికి కారణం. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఉనికి లేదు.రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయింది. ఏపీకి కేంద్రం సహకారం అందించి ఉంటే ఎంతో మేటు జరిగేది. మహానేత వైఎస్‌ఆర్ లేనిలోటు తీర్చగలిగే వ్యక్తి సీఎం వైఎస్ జగన్. రాష్ట్రానికి సీఎం వైఎస్ జగన్ నాయకత్వం అవసరం. సీఎం వైఎస్ జగన్ వద్ద గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు నమ్మరు. భవిష్యత్తులో చంద్రబాబు అధికారంలోకి రావడం కల్ల’’ అని వ్యాఖ్యలు చేశారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ విజయం పై స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్‌కు నివాళిగా 83 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారని ట్విట్ చేశారు.