ఆదోనికి మంచి రోజులొచ్చాయి
: ఆదోని ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి
కర్నూలు ప్రతినిధి, జూలై 05, (సీమకిరణం న్యూస్) : రాష్ట్ర ముఖ్యమంత్రి రాకతో ఆదోని నియోజకవర్గానికి మంచిరోజులు వచ్చినట్టైందని ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆదోని పట్టణానికి రెండు సార్లు వచ్చి బైపాస్ రోడ్డు నిర్మాణం మంజూరు చేయడం, తాగు నీటి సమస్యకు పరిష్కారం చూపడం జరిగిందన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ అభివృద్ది కోసం ఆదోని ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారన్నారు. ఐటీఐ కాలేజీ, ఉర్దూ మీడియం స్కూల్ మంజూరైనందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వందేళ్ల పురాతనమైన షాహీ ఈద్గా పునర్నిర్మాణం కోసం రూ. 2.60 కోట్లు మంజూరు చేసినందుకు మైనారిటీల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదోడు పేదోడిగా మిగిలిపోకూడదని ఆసరా, చేయూత, రైతు భరోసా, క్రాప్ ఇన్స్యూరెన్స్, ఉచిత బోర్లు వేయించడం వంటి పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి మరో 30 ఏళ్లు అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. ఆదోని పట్టణంలో రాష్ట్ర స్థాయి మూడో విడత విద్యాకానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. గతంలో మండల స్థాయికి వచ్చిన ప్రభుత్వాన్ని జగన్ మోహన్ రెడ్డి గ్రామాల్లోకి తీసుకొచ్చి లక్షా ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి వారిని ప్రభుత్వం లోకి తీసుకున్నారన్నారు. నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల నిర్మాణం, ఆటో నగర్ నిర్మాణం, రోడ్ల విస్తీర్ణం, ఐటీఐ కాలేజీలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకం చేపట్టాలని, ఆదోని రూరల్ లో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు.