మునిసిపల్ హై స్కూల్ లో నాడు-నేడు ఫలాలను పరిశీలించిన ముఖ్యమంత్రి
కర్నూలు / ఆదోని , జూలై 05, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్ర వ్యాప్త జగనన్న మూడో విడత పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఆదోని పట్టణానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటగా మన బడి నాడు-నేడు ద్వారా మునిసిపల్ హైస్కూల్ లో రూ.1.26 కోట్లతో పూర్తి చేసిన పనులను పరిశీలించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన నాడు-నేడు ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించిన అనంతరం మినరల్ వాటర్ ప్లాంటు నీరు తాగారు. పాఠశాల తొమ్మిదో తరగతి గదిలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన డెస్కులపై ఆశీనులై విద్యార్థినులతో ముచ్చటించారు. తమ పాఠశాలకు వచ్చి, తమ పక్కన సాక్షాత్తూ ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడటడంతో విద్యార్థినుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా జగనన్న కిట్లు పరిశీలించిన ముఖ్యమంత్రి 8వ తరగతి విద్యార్థులకు సైతం బైలింగువల్ పాఠ్య పుస్తకాలు అందించాలని అధికారులను ఆదేశించారు.