మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
నెల్లూరు, ఆత్మకూరు, ఏ ఎస్ పేట, అక్టోబర్ 12, (సీమకిరణం న్యూస్) :
మహిళా సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. బుధవారం వైఎస్సార్ క్రాంతి పథం ఆధ్వర్యంలో 3వ విడత వైఎస్సార్ చేయూత పథకాన్ని ఆయన మండల కేంద్రమైన ఏఎస్ పేట లోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం లాంచనంగా ప్రారంభించారు. తొలుత జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిళలు, ప్రజాప్రతినిధులతో కలసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సంకల్ప పాదయాత్రలో మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలకు స్థిరమైన జీవనోపాధి కోసం ఈ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రతి ఏడాది మహిళలకు రూ.18,750లు మహిళల అకౌంట్ లో జమ చేస్తుండడంతో వారు ఆర్ధికంగా అభివృద్ధి చెందుతున్నారని. భర్తలతో సమానంగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని తెలిపారు. చేయూత అందుకున్న ప్రతి మహిళ వ్యాపారాలు ప్రారంభించి తమ పిల్లలను సైతం బాగా చదివించుకుంటూ సంతోషంగా గడుపుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలోని మహిళలంటే జగనన్నకు ఎంతో గౌరవమని, పేదరికాన్ని తొలగించేందుకు ఇప్పటికే దాదాపు రూ.2.40 లక్షల కోట్లు వివిధ సంక్షేమ పధకాల ద్వారా అందచేస్తున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారి. చదువుకుని ఎవరి మీద ఆధారపడకుండా వారి భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటున్నారని, విద్యార్థులకు అమ్మబడి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు .కరోనా సమయంలో రాష్ట్రం ఆర్ధికంగా వెనుకబడినప్పటికి ఎవరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతోనే ప్రతి కుటుంబాన్ని ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఏఎస్ పేట మండల పరిధిలో 1892 మంది మహిళలకు మూడేళ్ల కాలంలో రూ.9.12 కోట్ల వైఎస్సార్ చేయూత నగదు అందించినట్లు తెలిపారు. అనంతరం మహిళల హర్షధ్వానాల మధ్య లబ్దిదారులకు వైఎస్సార్ చేయూత నమూనా చెక్ ను అందచేశారు. అదే విధంగా 78 స్వయం సహాయక సంఘాలకు రూ.5 కోట్ల బ్యాంకు రుణాలకు సంబంధించిన నమూనా చెక్ ను అందచేశారు. అంతకుముందు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఓఎస్డి చెన్నయ్య ,జెడ్పిటిసి సభ్యురాలు పందిళ్ళపల్లి రాజేశ్వరమ్మ, మండల కన్వీనర్ పందిళ్ళపల్లి సుబ్బారెడ్డి, రాజవోలు సొసైటీ చైర్మన్ కాటంరెడ్డి నరసింహారెడ్డి, ఎంపీడీవో ఎం భాస్కర్, ఏఎస్ పేట సర్పంచ్ భర్త షేక్ జిలాని భాష ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు చేయూత లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు…