అరుదైన గుండె శస్త్ర చికిత్స విజయవంతం : డాక్టర్ లక్ష్మణ స్వామి
కర్నూలు వైద్యం, నవంబర్ 15, (సీమకిరణం న్యూస్) :
కార్పోరేట్ నగరాలకు దీటుగా గుండెకు సంబంధించిన అతి క్లిష్టమైన సమస్యలకు విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్న నగరంలోని గౌరీ గోపాల్ హాస్పిటల్ లో ప్రపంచంలోనే అరుదైన గుండె సమస్యకు విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను నగరంలోని గౌరి గోపాల్ హాస్పిటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హాస్పిటల్ కార్డియోతోొరాసిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మణ స్వామి ,హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శివ శంకర్ రెడ్డి ,ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ మాలకొండయ్య తదితరులు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని శ్రీనివాస్ నగర్ కు చెందిన గిడ్డోజి రావు అనే వ్యక్తి గుండె సమస్యతో తమ హాస్పిటల్లో సంప్రదించారని తెలియజేశారు. ఆయనకు గుండెకు సంబంధించి యాంజియోగ్రామ్, 2d ఎకో లాంటి పరీక్షలు నిర్వహించడంతో అతని గుండె ఎడమ భాగంలో కాకుండా కుడి భాగంలో ఉన్నట్లు గుర్తించామన్నారు. అలాగే శరీరంలోని మిగతా అవయవాలు కుడి భాగంలో కాకుండా ఎడమ భాగంలో ఉన్నాయని గుర్తించామని,. దీనికి తోడు గుండెకు సంబంధించి తీవ్రమైన సమస్య ఉండటం తో బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. గత ఎనిమిది సంవత్సరాలుగా గిడ్డోజి రావు అనేక హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నప్పటికీ సమస్య తీవ్రత వల్ల ఎవరూ ముందుకు రాలేదని పేషెంట్ ద్వారా తెలిసిందన్నారు. ఈ పేషెంట్ కు తమ హాస్పిటల్ లో కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మణ స్వామి విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారని చెప్పారు. ఇలాంటి కేసులకు ప్రపంచంలో 38 మందికి మాత్రమే ఆపరేషన్లు జరిగాయని, అందులో కూడా బీటింగ్ హార్ట్ సర్జరీ విభాగంలో 15 మందికి మాత్రమే జరిగాయని చెప్పారు. ఈ ఆపరేషన్లు ఇండియాలో ఐదు మందికి జరిగాయని, అలాంటి ఆపరేషన్లు నగరంలోని గౌరీ గోపాల్ హాస్పిటల్ లో విజయవంతంగా చేశామని వారు తెలియజేశారు. ఈ ఆపరేషన్ ఆరోగ్య శ్రీ లో చెసామన్నారు. అనంతరం పేషెంటు గిడ్డోజి రావు మాట్లాడుతూ తనకు ఆపరేషన్ చేసి జీవితాన్ని ప్రసాదించిన కార్డియోతోరాశిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మణస్వామితోపాటు ఆసుపత్రి వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు.