విద్యార్థులు సమయాన్ని వృధా చేయకూడదు : టి.జి భరత్
కర్నూలు టౌన్, నవంబర్ 14, (సీమకిరణం న్యూస్):
విద్యార్థి దశలో సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవాలని కర్నూలు నియోజకవర్గ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. సోమవారం బాలల దినోత్సవం సందర్భంగా నగర శివారులోని తాండ్రపాడు శ్రీ లక్ష్మీ పాఠశాలలో ఏర్పాటుచేసిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ప్రణాళికగా చదువుకోవాలన్నారు. చదువుతో పాటు క్రీడలు, విజ్జానపరమైన అంశాలపై పట్టు సాధించాలన్నారు. అన్ని రంగాల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. గతంతో పోల్చితే నేటి చదువుల్లో చాలా మార్పులు వచ్చాయని.. విద్యార్థులకు సమయాన్ని వృధా చేయవద్దన్నారు. ఇక తల్లిదండ్రులు తమకు ఇష్టాలను పిల్లలపై రుద్దొద్దని.. వారికి ఇష్టమైన రంగంలో రాణించేలా విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.