ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేరిస్తే సహించం
– : దళిత గిరిజన మనోభావాలు దెబ్బతీసే జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలి
-: శాంతియుత నిరసన కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కైలాస్ నాయక్ డిమాండ్
కర్నూలు కలెక్టరేట్, నవంబర్ 21, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్ర ప్రభుత్వం ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేరిస్తే సహించేది లేదని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కైలాస్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం ఈ అంశాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ, ఎన్.టి.ఎఫ్. నాయకులు నవీన్, కుడుముల రామచంద్రయ్య, మోపురి సూర్య రావుల రాముడు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫెడరేషన్ జిల్లా నాయకులు రాము నాయక్, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు వెంకటేశులు,మద్దిలేటి, ఎస్టి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్య క్షులు రామాంజనేయ నాయక్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కైలాస్ నాయక్ మాట్లాడుతూ ఎస్టీ జాబితాలో ఇతర కులాలను చేర్చే
అంశం గురించి ఒక ఏక సభ్య కమిటీని పదవి విరమణ పొందిన ఐఏఎస్ కమిషనర్ శామ్యూల్ ఆనంద్ ను ఏర్పాటు చేస్తూ జీవోను తీయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అన్ని దళిత గిరిజన సంఘాలతో ఈ అంశంపై వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. దళిత గిరిజనుల మనోభావాలు దెబ్బ తినేలా ప్రభుత్వం తీసుకున్న 52,53 జీవోలు తక్షణమే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.1956 కు ముందే నాటి రాష్ట్ర ప్రభుత్వం లో కేంద్ర ప్రభుత్వానికి సంబం ధించిన కమిషన్ వచ్చి అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాయల సీమ ప్రాంతాల్లో అత్యంత వెనుక బడిన కులాలుగా ఉన్నటు వంటి కులాలను మాత్రమే గుర్తించడం జరిగిందన్నారు. ఎస్టీ లుగా గుర్తించడానికి వారికి ఉన్న సాంప్రదాయాలు, ప్రత్యేకమైన మహిళలకు దుస్తుల ధరింపు, ప్రత్యేక భాష వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎస్టి రిజర్వేషన్ కోట కింద కేటాయించిన కులాల్లో అప్పటికే రాజకీయ, ఆర్థికంగా అభివృద్ధిలో ఉన్నటువంటి బోయ కులానికి బీసీలుగా గుర్తించిన విషయం నేటి పాల కులు గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.ఎస్టీ రిజర్వేషన్ గా 56 ఏళ్లు గడుస్తున్నప్పటికీ లంబాడి, ఎరుకల,యానాది, చెంచు లతో పాటు ఇతర గిరిజన కులాలవారు కనీస సౌకర్యాలు కూడా నోచుకోవడం లేదన్నారు. ఈ అంశాలను ప్రభుత్వం పున: పరిశీలించాలని కైలాస్ నాయక్ కోరారు