లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకొని కేసులను పరిష్కరించుకోవాలి
జిల్లా ఎస్పీ సిధ్ధార్థ్ కౌశల్ ఐపియస్
కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
ఈ నెల 11 న నేషనల్ మెగా లోక్ అదాలత్
కర్నూలు క్రైమ్, ఫిబ్రవరి 09, (సీమకిరణం న్యూస్):
ఈనెల 11న జాతీయ మెగా లోక్ అదాలత్ లో భాగంగా కర్నూలు , బి. తాండ్రపాడు దగ్గర ఉన్న కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ సిధ్ధార్థ్ కౌశల్ ఐపియస్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. లోక్ అదాలత్ లో భాగంగా పోలీసుస్టేషన్ కు వచ్చిన కక్షిదారులు, ఇరుపక్షాల వారికి జిల్లా ఎస్పీ కౌన్సిలింగ్ చేశారు. ఫిబ్రవరి 11 న జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం గురించి జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ లలో సత్వర న్యాయ మేళా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారన్నారు. పెండింగ్ కేసులలోని కక్షి దారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇరు పక్షాల వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారన్నారు. నోటీసులు అందిన కక్షిదారులు వారి కేసులను లోక్ అదాలత్లో రాజీ ద్వారా పరిష్కరించుకొనేందుకు ముందుకు రావాలన్నారు.కేసులు రాజీ ద్వారా పరిష్కరించుకుంటే సమయం తగ్గుతుందని, డబ్బు ఆదా అవుతుందని, కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకొని కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. చిన్న చిన్న విషయాలకు ఘర్షణలతో పెండింగ్ కేసులు పేరుకు పోయాయని, రాజీ అయి కలిసి మెలిసి ఉండాలని తెలిపారు. కేసుల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కరించేలా చూడాలని, రాజీ అయ్యే వారికి కౌన్సిలింగ్ చేసి పెండింగ్ లో ఉన్న కేసులను తగ్గించాలని పోలీసు అధికారులకు ఎస్పీ తెలిపారు.విలేజ్ విజిట్ లు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు తాలుకా సిఐ రామలింగయ్య, ఎస్సైలు లక్ష్మీనారాయణ, మన్మథ విజయ్ ఉన్నారు