
మైనర్.. డ్రైవింగ్‌తో భవిష్యత్ నాశనం
-: నిత్యం తల్లిదండ్రులకు అవగాహాన
-: రూ 3.58 లక్షలు జరిమానా
-: ట్రాఫిక్ డిఎస్పీ ముత్యాల నాగ భూషణం
కర్నూలు క్రైమ్, ఫిబ్రవరి 23, (సీమకిరణం న్యూస్) :
జిల్లాలో అధిక శాతం మంది మైనర్లు డ్రైవింగ్ చేస్తూ చే జేతులా వారి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని, తల్లిదండ్రులు మైనర్ల పట్ల కఠినమైన నియమాలు అమలు చేయాలని ట్రాఫిక్ డిఎస్పీ ముత్యాల నాగభూషనం అన్నారు. మంగళవారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మైనర్ డ్రైవింగ్ ప్రమాదాలపై బాధిత కుటుంబాలతో కలిసి వివరాలు వెల్లడించారు. తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 12 సార్లు మైనర్ డ్రైవింగ్ పైన స్పెషల్ డ్రైవింగ్ చేయగా 377 వాహనాల తల్లి దండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి రూ 3.58 లక్షలు జరిమానా విధించామన్నారు. దీంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధించి 25 కేసులు నమోదు చేసి రూ.5 లక్షలకు పైగా జరిమానా విధించామన్నారు. ప్రధానంగా మైనర్ డ్రైవింగ్ వల్ల గత వారంలో కర్నూలు నగరం, ఎమ్మిగనూరు పట్టణంలో జరిగిన రెండు ప్రమాదాల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలకు సంబంధించిన వివ రాలను వెల్లడించారు. కర్నూలు నగరంలోని
ఎక్సైజ్ పోలీసు స్టేషన్ సమీపంలో ముగ్గురు మైనర్ విద్యార్థులు ద్విచక్ర వాహనంపై అతివేగం కారణంగా డ్రైవింగ్ చేస్తున్న మనోహార్ (17) మృతి చెందగా, అభిషేక్ ప్రస్తుతం వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని, ధనుంజయ్‌కు ఎటు వంటి గాయాలు కాలేదన్నారు.ఈ ముగ్గురు విద్యా ర్థులు 10వ తరగతి విద్యను అభ్యశిస్తూ స్నేహితుడి వాహనంతో అతివేగంగా డ్రైవింగ్ చేయడం వల్లనే ఒక్కసారిగా కుప్పకులారన్నారు. ఇలాంటి ప్రమాదాలు జిల్లా వ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయని గుర్తు చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోనూ శివ, నరసింహులు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. ఈ ప్రమాద సంఘటన పరిశీలిస్తే అతివేగం, నిర్లక్ష్యం కారణమే నన్నారు. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ చేయడాన్ని సంబంధిత తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితులలో ప్రోత్సహించరాదని, జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులు అత్యంత ముఖ్యమైన మూడు అంశాలపై దృష్టి పెట్టారని ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించ రాదని ( త్రిబుల్ డ్రైవింగ్), 18 ఏళ్ల లోపు వారు (మైనర్ డ్రైవింగ్) , రోడ్డు భద్రతా నియమాలు (ట్రాఫిక్) నిబంధనలను ఉల్లంఘించరాదన్నారు. తాను బాధ్యతలు చేపట్టినాటి నుంచి ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ, ఇంటర్ కళాశాలలో దాదాపు 50 అవగాహాన సదస్సులు నిర్వహించానని స్పష్టం చేశారు. నిత్యం సాయంత్రం వేళల్లో మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన తల్లిదండ్రులను పిలిపించి స్టేషన్ ఆవరణంలో అవగాహాన కల్పిస్తున్నామని , కొంత వరకే మార్పు వచ్చిందని, మార్పు మరింత మెరుగు పడాలన్నారు. మైనర్ డ్రైవింగ్ వల్ల జరుగుతున్న ప్రమాదాలపై పదేపదే తెలియజేశారు. ఈ సమావేశంలో సిఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.