సంస్కరణల ముసుగులో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగు
సంస్కరణల ముసుగులో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగు
ప్యాపిలి, ఫిబ్రవరి 28, (సీమకిరణం న్యూస్ ) :
ప్యాపిలి ఎస్టీయు అద్యక్షులు చంద్ర మౌళి అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఎస్టీయు నంద్యాల జిల్లా అధ్యక్షుడు అజామ్ బేగ్ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం పేరుతో మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేయడo వల్ల మూడు నాలుగు ఐదో తరగతిలోని పిల్లలు గ్రామానికి దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలలకు నడిచి వెళ్లడం కష్టం కాదా? మరి ఉన్నత పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య తగ్గిపోదా? ఇటీవల జారీ చేయబడిన కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒకటో తరగతిలో విద్యార్థులు చేరాలి అంటే ఆరు సంవత్సరాల వయసు కచ్చితంగా ఉండాలి అంటున్నారు అంటే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మూడు సంవత్సరాలకే పిల్లలను వారి పాఠశాలల్లో చేర్పిస్తూ ఉంటే ఆరు సంవత్సరాల వరకు వేచి ఉండి ఒకటో తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేరే పరిస్థితి సాధ్యమేనా? విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఒకటవ తరగతికి అడ్మిషన్లు కల్పించి అమ్మఒడితో వారి ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తే ఇక ఒకటవ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థులు ఎక్కడ ఉంటారు? ఎనిమిది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తామన్నారు. మొత్తానికి నాడు నేడు పేరుతో పాఠశాలలను సుందరీకరణ చేస్తూ,ఉపాధ్యాయుల కొరత సృష్టించి,విద్యార్థులు లేరనే సాకుచూపి ప్రభుత్వం ఉచిత విద్య నుంచి తప్పించుకుని చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనేది తేట తెల్లం అవుతుంది. ప్రజలు దీన్ని గమనించకపోతే భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో పేద బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన ఉచిత విద్య అందని ద్రాక్షగా మిగులుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ నాయక్, జిల్లా సీ.పీ.యస్ కన్వీనర్ చిన్నపరెడ్డి, ఎస్టీయు ప్యాపిలి నాయకులు చంద్ర మౌళి, టీవీ రమేష్,కిరణ్ కుమార్, మధు,శ్రీనివాసులు,
తదితరులు పాల్గొన్నారు.