ఉగాది శుభాకాంక్షలు
కేశవరెడ్డి పాఠశాలల వ్యవస్థాపక అధ్యక్షులు యన్.కేశవ రెడ్డి
కర్నూలు టౌన్, మార్చి 23, (సీమకిరణం న్యూస్) :
హిందువులకు అతి శ్రేష్ఠమైన ఉగాది పండగను పురస్కరించుకొని ముందస్తుగా నగరంలోని “న్యూ కృష్ణా నగర్” లోని కేశవరెడ్డి పాఠశాల యందు ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రైమరీ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో చిన్నారులు తెలుగుదనం ఉట్టిపడేలా పట్టు వస్త్రాలు ధరించి, పంచాంగ శ్రవణం చెప్పే విధానం, షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడి, సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ సందర్భంగా కేశవరెడ్డి పాఠశాలల వ్యవస్థాపక అధ్యక్షులు యన్.కేశవ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది శోభకృత్ నామ సంవత్సరం లోకి మనమందరం అడుగుపెడుతున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాలు చేకూరాలని కోరారు. ఈ ఉగాది రోజునే అంటే చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఈ విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి ఉగాది రోజున పచ్చడి, పంచాంగ శ్రవణం, మిత్ర దర్శనం, ఆర్య పూజనము, గోపూజ, అనే ఆచారాలు మన తెలుగు ప్రజలు పాటిస్తారని, ఇలాంటి గొప్ప సంస్కృతికి ఆటపట్టైన మన పండుగల గురించి తమ విద్యార్థులకు అవగాహనను కల్పిస్తూ వారిలో ఉన్న సృజనాత్మకతను బయటికి తీయడం లో ఎప్పుడు తమ పాఠశాలలు ముందు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా గా ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలో పాల్గొన్న విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు.