జర్నలిస్టుల పై ఉప, దేశద్రోహం చట్టాలను ప్రయోగించడం ఆపాలి
– దాడులను అరికట్టాలి
– బడా కార్పొరేట్ సంస్థల భారీ నుంచి మీడియాని విడుదల చేయాలి
– జర్నలిస్టుల రక్షణకు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో చట్టాలు తీసుకురావాలి
– ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేత
కర్నూలు టౌన్, మార్చి 23, (సీమకిరణం న్యూస్) :
ప్రభుత్వాలు చేసే అవినీతి, అక్రమాలను ఎత్తిచూపితే జర్నలిస్టుల పై ఉప, దేశద్రోహం లాంటి చట్టాలను ప్రయోగించడం ఆపేయాలని ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కొండప్ప, కే.నాగరాజు ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎన్వీ.సుబ్బయ్య, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ.ఎన్.రాజు, శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి సీ.రామాంజనేయులు, జిల్లా సహాయ కార్యదర్శి శివరాజ్ కుమార్ డిమాండ్ చేశారు. మార్చి 23 భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ వర్ధంతి సందర్భంగా సేవ్ జర్నలిజం డే కార్యక్రమానికి ఐజేయూ పిలుపు ఇచ్చింది. దీంతో కర్నూల్ నగరం లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కొండారెడ్డి బురుజు నుంచి పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహం ముందు ధర్నా నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మీడియా పరిస్థితి పాలకుల దృష్టికి తీసుకెళ్లడానికి దేశవ్యాప్తంగా ‘సేవ్ జర్నలిజం’ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా పాలక శక్తుల ఇష్టాయిష్టాలకు లొంగని స్వతంత్ర జర్నలిస్టులు, మీడియా సంస్థల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసహన వైఖరి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు. ప్రస్తుతం దేశం, రాష్ర్టంలో బడా కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాలలో మీడియా చిక్కుకుపోయింది అని, వారి భారి నుండి మీడియాను విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే సంపాదకులు మరియు జర్నలిస్టుల స్వతంత్రతను కాపాడాలన్నారు. జర్నలిస్టులపై ఉప మరియు దేశద్రోహం వంటి క్రూరమైన చట్టాలను ప్రయోగించడం ఆపాలన్నారు. అధికార కేంద్రాల శ్రేణిలో జర్నలిస్టులు దూసుకుపోనందున వారిని దేశ వ్యతిరేకులుగా పేర్కొనడం మానుకోవాలన్నారు. ఐటీ నిబంధనల ముసుగులో డిజిటల్ మీడియాకు సమస్యలు సృష్టించడం అపాలన్నారు. మీడియాకు సంబంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేసేందుకు వెంటనే మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) మరియు సెంట్రల్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ (సీఎంఏసీ)లోని అన్ని గుర్తింపు పొందిన జర్నలిస్టు యూనియన్‌లకు ప్రాతినిధ్యాన్ని పునరుద్ధరించాలని కోరారు. జర్నలిస్టులు మరియు మీడియా సంస్థలపై దాడులు పెరిగి పోతున్నాయని, దాడుల నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రక్షణ చట్టం కేంద్రంలో మరియు రాష్ట్ర స్థాయిలో కూడా ఉండాలన్నారు. రైల్వేలో జర్నలిస్టులకు అన్ని రాయితీలను పునరుద్ధరించాలన్నారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ను ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్‌లో గతంలోని ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అన్ని ఇతర సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఏబీఎన్ సుంకన్న, మల్లికార్జున ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు చిరంజీవి, మధు, నాయకులు దిశా పేపర్ బ్యూరో నాగేశ్వర రావు, వీడియో జర్నలిస్టు యూనియన్ నాయకులు స్నేహల్, సూరి, కిరణ్, రామ్మోహన్, రాజు, నాగేష్, రమేష్, సురేష్, సురేంద్ర, నరసింహ తదితరులు పాల్గొన్నారు.