ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి
ప్రజలకు హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ చేపట్టిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్
కర్నూలు క్రైమ్, మార్చి 24, (సీమకిరణం న్యూస్):
రోడ్డు భద్రతలో భాగంగా హెల్మెట్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ శుక్రవారం కర్నూలు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై , హెల్మెట్ ధరించి బైక్ నడిపి హెల్మెట్ అవగాహన ర్యాలీని ఉత్సాహపరిచారు. పోలీసులు హెల్మెట్లు ధరించి కర్నూలు పట్టణంలో ద్విచక్రవాహనాలపై తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు.
జిల్లా పోలీసు కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ హెల్మెట్ ర్యాలీ కంట్రోల్ రూమ్ మీదుగా కిడ్స్ వరల్డ్, రాజ్ విహార్ నుండి కలెక్టరేట్ కు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ కర్నూలు కలెక్టరేట్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ
రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం మరియు డిజిపి ఆదేశాలు జారీ చేశారన్నారు.
అందులో భాగంగా గత 3 ఏళ్ళల్లో కర్నూలు జిల్లాలో 2021 లో 361 మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోగా, 700 పైగా మంది గాయ పడ్డారన్నారు.
2022 లో 357 మంది చనిపోగా, 706 మంది గాయపడ్డారన్నారు.
2023 లో ఇప్పటివరకు 45 మంది చనిపోగా, 109 మంది గాయ పడ్డారన్నారు.
ఈ విధంగా రోడ్డు ప్రమాదాలు జరిగి మరణిస్తే వారి పై ఆధారపడిన కుటుంబాల పరిస్ధితి ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. ఆర్ధికంగా, సామాజికంగా, మానసికంగా ఒత్తిడి గురవుతారన్నారు. కాబట్టి ప్రతిఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.
70 శాతం రోడ్డు ప్రమాదాలలో ద్వి చక్ర వాహనాల ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రమాద సమయంలో తలకు దెబ్బలు తగలడం వలనే ప్రాణాలను కోల్పోతున్నారని, దీనికి హెల్మెట్ ధరించకపోవడమే ఫ్రధానకారణమన్నారు.
వ్యక్తిగతంగా తాను ఎక్కడ ఉన్నా కూడా జిల్లా ఎస్పీ గా స్వయంగా బైక్ పై వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తామన్నారు.
పోలీసు శాఖలో బైక్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
ట్రాఫిక్ మిత్ర అనే కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు కనబడితే ఫోటో తీసి కర్నూలు ట్రాఫిక్ మిత్ర పోర్టల్ కు పంపే విధంగా ఏర్పాటు చేశామన్నారు.
ఏవరికి వారు తమ భద్రతకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, అందువలన సురక్షితంగా ఉంటారని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కర్నూలు జిల్లా పోలీసుశాఖ తరపున ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
కళాశాలల విద్యార్ధులు, యువత, ప్రజలు చిన్న చిన్న , దూర ప్రయాణాలకు వెళ్ళినా కూడా హెల్మెట్ ధరించాలన్నారు.
హెల్మెట్ ధరించి బైక్ నడిపే ప్రతి ఒక్కరూ సమాజంలో హీరో(HERO) అవుతారన్నారు.
హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే ఏదైనా ప్రమాదం జరిగితే త్వరగా జీరో(Zero) అయిపోతారన్నారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ , సురక్షితంగా గమ్యాలను చేరుకోవాలన్నారు.
బైక్ నడిపేటప్పుడు హెల్మెట్లు, కార్లు నడిపినప్పుడు సీట్ బెల్టులు తప్పనిసరిగా ధరించాలని , చరవాణీ (సెల్ ఫోన్లు) మాట్లాడుతూ వాహనాలు నడపవద్దన్నారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు ట్రాఫిక్ డిఎస్పీ నాగభూషణం , కర్నూలు పట్టణ డిఎస్పీ కెవి మహేష్, కర్నూలు పట్టణ సిఐలు శంకరయ్య, శ్రీనివాసులు, తబ్రేజ్ , తిమ్మారెడ్డి, శ్రీనివాసులు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది , సుజికి షోరూమ్, బజాజ్, ఎంజి బ్రదర్స్, ఎస్ ఎస్ హోండా, వాసవి హోండా, సస్యహిరో, TVS షోరూమ్ లకు చెందిన మెకానిక్స్, సిబ్బంది 500 మంది వరకు పాల్గొన్నారు.