జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలి
– కొత్తవి ఇచ్చే వరకు పాతవి రెన్యువల్ చేయాలి
– ఏపీయూడబ్ల్యూజే డిమాండ్
– డీఆర్వో కు వినతి పత్రం అందజేత
కర్నూలు టౌన్, ఏప్రిల్ 04, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్రంలో జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలని ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో డీఆర్వో కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కొండప్ప, ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవ సలహాదారులు వైవీ. క్రిష్ణా రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఈ.ఎన్.రాజు, శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి అంజి, జిల్లా సహాయ కార్యదర్శి అవినాష్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిరంజీవి, మధు మాట్లాడుతూ.. జనవరిలో కొత్త అక్రిడేషన్లు ఇవ్వాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల మూడు నెలలు పాత కార్డ్స్ నే రెన్యువల్ చేయడం జరిగిందన్నారు. మార్చి నెలాఖరుతో వాటి గడువు కూడా ముగిసిందన్నారు. తిరిగి కొత్త అక్రిడేషన్ ఇవ్వటం గాని, ఉన్న వాటిని రెన్యువల్ చేయటం గాని ఇప్పటివరకు జరగలేదన్నారు. కనుక ప్రభుత్వం తక్షణమే స్పందించి అక్రిడేషన్ల ను వెంటనే రెన్యువల్ చేయాలని, బస్ పాస్ లను తక్షణమే మంజూరు చేయాలన్నారు. అలాగే అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్టు యూనియన్స్ కు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. ప్రతి మండలంలో 100 పత్రికలు అనే నిబంధనలను అక్రిడేషన్ మంజూరుకు తొలగించాలన్నారు. కొత్తగా ఇచ్చిన జీవోలో ఉన్న అసంబద్ధ నిబంధనలను తొలగించి కొత్త జీవోను ఇవ్వాలన్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ విషయంలో ఇంకా జాప్యం జరిగితే ప్రత్యక్ష ఆందోళన చెప్పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు చంద్ర శేఖర్, గోపాల్, శ్రీనాథ్ రెడ్డి, ఇస్మాయిల్, వీడియో జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు స్నేహాల్, శేఖర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.