యునాని వైద్యశాలను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తా… టి.జి భరత్
… యునాని వైద్యశాలకు వైద్య పరికరాలు విరాళమిచ్చిన టిజి భరత్
కర్నూలు టౌన్, ఏప్రిల్ 26, (సీమకిరణం న్యూస్) :
పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే యునాని వైద్యశాలను రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ అన్నారు. గురువారం నగరంలోని యునాని వైద్యశాలకు ఆయన రూ. 2.30 లక్షలు విలువ చేసే అత్యాధునికమైన 4 బెడ్స్, లేబర్ రూములో ప్రత్యేకమైన బెడ్ ను విరాళంగా అందజేశారు. అనంతరం టిజి భరత్ మాట్లాడుతూ ఓల్డ్ సిటీ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఈ ఆసుపత్రిని సందర్శించిన సమయంలోనే అత్యవరమైన ఈ పరికరాలు అందజేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. హాస్పిటల్ యాజమాన్యం కోరిన విధంగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో అవసరమయ్యే డి.జి సెట్ ను కూడా వీలైనంత త్వరగా అందిస్తానని చెప్పారు. తాను ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ విరాళాలు ఇవ్వడం లేదని టిజి భరత్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగానే మా టీజీవీ సంస్థల తరుపున సేవ కార్యక్రమాలు చేస్తున్నట్లు భరత్ తెలిపారు. ప్రజల కోసమే కార్పోరేట్ స్థాయిలో ఉండే అత్యాధునికమైన బెడ్స్ అందించానన్నారు. యునాని వైద్యశాలను భవిష్యత్తులో అంచెలంచెలుగా తీర్చిదిద్దుతానన్నారు. ఇక సేవ చేసే వారిని ప్రోత్సహిస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని ఈ సందర్భంగా భరత్ అన్నారు. డబ్బు అందరూ సంపాదిస్తారని అయితే సేవా కార్యక్రమాలు కొంతమందే చేస్తారన్నారు. తమ టీజీవీ సంస్థల తరుపున కర్నూల్లో సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. అనంతరం హాస్పిటల్ యాజమాన్యం, ముస్లిం నేతలు శాలువా కప్పి టిజి భరత్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ భాష, టిడిపి నేతలు ఇబ్రహీం, మన్సూర్ ఆలీఖాన్, అబ్బాస్, మెహబూబ్, ఊట్ల రమేష్, రవి, పాల్ రాజ్, రాజ్ కుమార్, విక్రమ్ సింగ్, మహిళా నాయకురాలు రాజ్యలక్ష్మి, మారుతీ శర్మ, తదితరులు పాల్గొన్నారు.