వెనుకబడిన కర్నూలు జిల్లాలో వేసవికాలంలో కూడా పనులు కల్పించకపోతే ఎలా?
12 మండలాల్లో నిర్దేశించిన లక్ష్యంలో 50 శాతం కంటే తక్కువ పనులు కల్పించిన అధికారులు
తీవ్ర అసంతృప్తి ని వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 27, (సీమకిరణం న్యూస్) :
జిల్లాలో 12 మండలాల్లో నిర్దేశించిన లక్ష్యంలో 50 శాతం కంటే తక్కువ పనులు కల్పించారని, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన తీవ్ర అసంతృప్తి ని వ్యక్తం చేశారు.. వెనుకబడిన కర్నూలు జిల్లాలో వేసవికాలంలో కూడా పనులు కల్పించకపోతే ఎలా? అంటూ అధికారులను ప్రశ్నించారు. గురువారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పంచాయతీ రాజ్, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్, డిఆర్డిఎ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 110,120 శాతం చేయాల్సింది పోయి నిర్దేశించిన లక్ష్యాలు కూడా సాధించలేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు .. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం టార్గెట్ తక్కువగా ఇచ్చినప్పటికీ కూడా లక్ష్యాన్ని సాధించలేకపోయారన్నారు. ముఖ్యంగా 50 శాతం కంటే తక్కువగా 12 మండలాలు ఉన్నాయని, అందులో హాలహార్వి 24 శాతం, నందవరం 35.89 శాతం, చిప్పగిరి 37.17 శాతం మాత్రమే పనులు కల్పించారని, ఎందుకు పనులు కల్పించడం లేదని సంబంధిత ఏపిడి లను ప్రశ్నించారు. వెల్దుర్తి, పత్తికొండ తదితర మండలాల్లో చేయగా లేనిది మీరెందుకు చేయలేరని కలెక్టర్ అధికారులను నిలదీశారు.. ఏవేవో కారణాలు చెప్పకండని, లక్యం మేరకు పనులు కల్పించకపోతే ఏపిడి లు, ఎంపిడిఓ లపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.. అలాగే NMMS యాప్ లో లేబర్ అటెండెన్స్ కి సంబంధించి వెల్దుర్తి, ఎమ్మిగనూరు,సి.బెలగల్ మండలాల్లో 70 శాతం లోపే ఉండడంతో వచ్చే వారం లోపు 95 శాతం కంటే తక్కువ అటెండెన్స్ నమోదు అయితే సంబంధిత ఎంపీడీవోలు, ఏపిడిలకు వేతనాలు నిలుపుదల చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ లకు జాబ్ కార్డుల జారీలో కూడా కొన్ని మండలాలు వెనుకబడి ఉండటంపై కలెక్టర్ సంబంధిత ఏపీడి లపై అసహనం వ్యక్తం చేశారు.. చిప్పగిరి, గూడూరు, నందవరం, పెద్ద కడుబూరు మండలాలు ఎస్సీ లకు, చిప్పగిరి,గోనెగండ్ల, పెద్దకడుబూరు మండలాలు ఎస్టీ లకు అతి తక్కువ జాబ్ కార్డులు మంజూరు చేశారని, ఆ మండలాలకు వెళ్ళి ఎస్సీ,ఎస్టీ లకు లక్ష్యం మేరకు జాబ్ కార్డులు మంజూరు చేయాలని కలెక్టర్ సంబంధిత ఏపిడీలను ఆదేశించారు. ఉపాధి హామీ పనుల్లో మహిళలు మాత్రమే ఎక్కువ వస్తున్నారని, పురుషులు ఎందుకు రావడం లేదని, పురుషులు కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకుని, సామాజిక మార్పు దిశగా ఒకింత దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు.. అభివృద్ధి పనులకు సంబంధించి ఈ నెలలో 20 శాతం టార్గెట్ ఇవ్వగా, తొమ్మిది శాతమే పూర్తి చేశారని, పంచాయతీ రాజ్ ఏఈలు, డ్వామా ఏపిడిలు సమన్వయం పనిచేసి పురోగతి సాధించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్రమణ్యం ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అమృత్ సరోవర్ కి సంబంధించి పెండింగ్ లో ఉన్న 24 పనులను త్వరితగతిన చేయించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్లాంటేషన్ కోసం వచ్చే గురువారం నాటికి భూమిని గుర్తించాలని సూచించారు..ఉపాధి హామీ కింద అన్నీ డీసిల్టింగ్ పనులే కాకుండా ఇతర పనులను కూడా చేపట్టాలని కలెక్టర్ డ్వామా పిడి అమర్ నాథ్ రెడ్డి కి సూచించారు. జగనన్న తోడుకి సంబంధించిన దరఖాస్తులను బ్యాంకులకు త్వరితగతిన పంపించాలని, అలాగే బ్యాంకు లలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు బ్యాంకు రుణం మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిఆర్డిఎ పిడి వెంకట సుబ్బయ్య ను ఆదేశించారు. హౌసింగ్ కి సంబంధించి ఇళ్లు మంజూరైన ఎస్ హెచ్ జి సభ్యుల్లో 39 వేలకు గాను 28 వేల మందికి రుణాలు మంజూరయ్యాయని, మిగిలిన 11 వేల మందికి కూడా రుణాలు మంజూరు చేయించాలని ఆదేశించారు. మహిళా మార్ట్ లలో మిల్లెట్ స్నాక్స్ అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కర్నూలు నగరంలో వాకింగ్ చేసే ప్రాంతాలలో ఎస్హెచ్జి గ్రూపులతో మాట్లాడి మిల్లెట్ కేఫ్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదోని ఏరియా లో జీన్స్ క్లస్టర్ ఏర్పాటుకు MSME కింద కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు..తడకనపల్లి లోనూ, ఆదోని ఏరియా అభివృద్ధి లో భాగంగా అస్పరి, పత్తికొండ, తుగ్గలి మరియు గోనేగండ్ల లో కూడా సోలార్ డ్రైయర్స్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని డిఆర్డిఎ పిడి జిల్లా కలెక్టర్ కి వివరించారు. స్వమిత్ర కింద చేపడుతున్న రీసర్వే పనులపై కలెక్టర్ డిపిఓ తో ఆరా తీశారు.. 67 గ్రామాలకు గాను 32 గ్రామాలలో సర్వే పూర్తి చేసి 13 వ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగిందని, డ్రాఫ్ట్ ఆర్వోఆర్ కూడా సిద్ధం చేసి కమిషనరేట్ కార్యాలయానికి పంపించడం జరిగిందని, 8 గ్రామాలకు సంబంధించి ఆమోదం తెలిపి ఎడి సర్వే లాగిన్ కి పంపించారని డిపివో వివరించారు..మిగిలిన గ్రామాల్లో కూడా త్వరితగతిన పనులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా గ్రామాల్లో వారంలో ఒకరోజు డ్రైవ్ నిర్వహించి ఊరి బయట, రోడ్ల మీద వేస్తున్న చెత్త తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ కి సంబంధించి నీటిని రవాణా చేస్తున్న గ్రామాల వివరాలతో ప్రతిపాదనలు తనకు సమర్పించాలని, గ్రీన్ కో సంస్థ ద్వారా వీటిని స్పాన్సర్ చేయిస్తానని కలెక్టర్ ఎస్ ఈ నాగేశ్వర రావు కు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, డ్వామా, డి ఆర్ డి ఎ శాఖల అధికారులు పాల్గొన్నారు.