జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి
- జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి
- దాడుల నివారణకు యాంటీ అటాక్ కమిటీలు పునరుద్ధరించాలి
- పత్రిక స్వేచ్చ ను కాపాడాలి
- ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఎస్పీ కు వినతి పత్రం అందజేత
కర్నూలు క్రైమ్, జూన్ 21, (సీమకిరణం న్యూస్):
నిజాలు నిర్భయంగా రాసే జర్నలిస్టుల పై దాడి చేయడం, తిరిగి జర్నలిస్టుల పైనే కేసులు నమోదు చేయడం ఇటీవల కాలంలో పెరిగి పోయింది అని, ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కొండప్ప, కే.నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ.ఎన్.రాజు, కే. శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి అంజి, ఏబీఎన్ స్టాఫర్ సుంకన్న, ఆర్ టీవీ స్టాఫ్ రిపోర్టర్ హుస్సేన్, బిగ్ టీవీ స్టాఫ్ రిపోర్టర్ నాగేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. జర్నలిస్టుల పై పెడుతున్న అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ బుధవారం జిల్లా ఎస్పీ జీ.కృష్ణ కాంత్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్తికొండ మండలం, హోసూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు కేవీ రమణ విద్యార్థినిల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నాడనే తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆంధ్ర జ్యోతి పీసీ ఇంచార్జి రాజేష్ గౌడ్ వార్త రాయడం జరిగింది అన్నారు. అయితే ఈ విషయం పెద్దది కాకుండా వైసీపీ నేతలు రంగలోకి దిగినట్టు కూడా వార్తలో రాయడం జరిగింది అన్నారు. అయితే ఇది జీర్ణించుకోలేని వైసీపీ నేతలు రాజేష్ గౌడ్ ను నానా భూతులు తిడుతూ ఆయన పై దాడి చేశారన్నారు. దీంతో రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారని, కానీ వైసీపీ నేతలే రాజేష్ తమ పై దాడి చేశారని ఫిర్యాదు చేయడం, పోలీసులు ముందు వారి కేసు కట్టడం జరిగింది అన్నారు. బాధితుడికి న్యాయం చేయాల్సిన పోలీసులు బాధితుడి పైనే కేసు నమోదు చేయడం బాధాకరమన్నారు. ఈ సంఘటనే కాకుండా కొన్ని నెలల క్రితం కోడుమూరు విశాలాంధ్ర రిపోర్టర్ సతీష్ పైన కూడా వైసీపీ నేత దాడి చేసి గాయపరిస్తే.. తిరిగి ఆయనపైనే కేసు పెట్టారన్నారు. అలాగే అగ్రసేని ఆసుపత్రి వద్ద కవరేజ్ కు వెళ్ళిన వీడియో జర్నలిస్టుల పై ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది భూతులు తిట్టి దాడి చేయడానికి ప్రయత్నిస్తే.. ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదు తో వీడియో జర్నలిస్టులపై కౌంటర్ కేసు పెట్టడం జరిగిందన్నారు. ఇలా ఇటీవల కాలంలో ఎప్పుడు లేని విధంగా జర్నలిస్టుల పై దాడి చేయడం, జర్నలిస్టుల పైనే కేసులు నమోదు చేయడం పెరిగి పోతుందన్నారు. ఇలా అయితే జర్నలిస్టులు ప్రజలకు జరిగే అన్యాయాలు, అవినీతి, అక్రమాలు వెలుగులోకి తీసుకురావడానికి వెనకడుగు వేసే పరిస్థితి వస్తుందన్నారు. అదే జరిగితే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అన్నారు. కనుక దీనిపై మేధావులు, ప్రజాస్వామ్య వాదులు అందరూ ఈ సంఘటనలను ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. పత్రికా స్వేచ్ఛ ను కాపాడడం తో పాటు.. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసుల పై రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అక్రమ కేసులు ఎత్తేసేవరకు ఆందోళన లను మరింత ఉదృతం చేస్తామని చెప్పారు. అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే త్వరలో ఛలో కర్నూలు చేపట్టి తమ నిరసన పాలకులకు, అధికారులకు తెలియజేస్తామని చెప్పారు. ఎస్పీని కలసిన వారిలో యూనియన్ సభ్యులు రాజశేఖర్, మద్ది తదితరులు ఉన్నారు.