తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం
తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం
రానున్న వేసవి కాలంలో కర్నూలు నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ పేర్కొన్నారు. శనివారం మునగాలపాడు పంపింగ్ స్టేషన్ నందు అమృత్ స్కీం కింద సుంకేసుల జలాశయం నుంచి మునగాల పాడు పంపింగ్ స్టేషన్ వరకు 82 కోట్లతో నిర్మించనున్న పైప్ లైన్ నిర్మాణానికి మేయర్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి , హఫీజ్ ఖాన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ కర్నూలు నగర ప్రజల దాహార్తి తీర్చుటకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, అందులో భాగంగానే గత ఏడాది జూన్ 7న ఈ పైప్ లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు.ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకంలో 14.32 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 5.66 కోట్లు నిధులు కేటాయిస్తారని, మిగతా 62.02 కోట్లు నగర పాలక సంస్థ యూ.ఎల్.బి. సాధారణ నిధులు/ఎఫ్.సి. గ్రాంట్లు – రూ.34.62 కోట్లు, బి.పి.ఎస్. పథకం – రూ.24.75, ఎల్.ఆర్.ఎస్. పథకం 2020 – రూ.2.65 కోట్లు, మొత్తం రూ.62.02 కోట్ల నిధులతో నిర్మిస్తున్నామన్నారు.ఈ నిర్మాణం 15 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. అలాగే గత ఏడాది డిసెంబర్ నెల 22న కర్నూలు జిల్లా ఓర్వకల్ ఎయిర్ పోర్టుకు సీఎం జగన్ గారు వచ్చిన సందర్భంలో, కర్నూలు నగర తాగునీటి ఎద్దడి శాశ్వత నివారణకు, రూ.59.65 కోట్ల అంచనాలతో కూడిన హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ వద్ద ఆఫ్టెక్ స్ట్రక్చర్ నిర్మించుటకు మరియు 30 ఎం.ఎల్.డి.ల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సిఎం గారికి కోరగా వెంటనే కలెక్టర్ గారికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారని ఆ ప్రతిపాదనలు ఈ నెలలో పూర్తి అవుతాయని త్వరలో వాటికి కూడా శంకుస్థాపన చేస్తామన్నారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రమోహన్, నగర పాలక సంస్థ ఎస్.ఈ. సురేంద్ర బాబు, ఎం.ఈ. శేషసాయి, డీఈఈ రవిప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.