గాడి తప్పుతున్న సచివాలయం వ్యవస్థ
-: సమయ పాలన పాటించని అధికారులు
పెద్దకడబూరు, జూలై 04, (సీమకిరణం న్యూస్):
ప్రజలకు నిత్యం గ్రామస్థాయిలో అన్ని రకాల సేవలు అందించాలనే దృఢ సంకల్పంతో వైయస్సార్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినది సచివాలయ వ్యవస్థ. అయితే అక్కడి సచివాలయంలో విధులు నిర్వర్తించే అధికారులు ఏ ఒక్కరూ సమయపాలన పాటించకుండా వారు వచ్చినదే సరైన సమయం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. గ్రామస్తులు వారి అవసరాల కోసం సమీపంలోని సచివాలయాలను ఆశ్రయించి సంబంధిత అధికారులతో పనులు చేయించుకుంటారు. అయితే పెద్దకడబూరు మండల పరిధిలోని నౌలేకల్ గ్రామ సచివాలయ అధికారులు సకాలంలో విధులకు హాజరు కాకుండా ఇష్టానుసారంగా రావడం జరుగుతుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు నెలలు తరబడి సరిగ్గా రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏమన్నా అడిగితే వేరే ఊర్లకు ఇన్చార్జిగా ఉన్నామని పేర్కొనడం గమనార్హం. అందువల్లనే ఆలస్యానికి కారణమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి మంచి జరిగేటట్లు చూడాలని చెపుతుంటే అలాంటిది ఉదయం 11 గంటల తరువాత రావడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆర్ బికే బజారి ఒక్కరే సక్రమంగా వస్తున్నారు తప్ప మిగిలిన అధికారులకు ఎలాంటి అదనపు బాధ్యతలు ఉన్నతాధికారులు అప్పగించారో మాకు అర్థం కావడంలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామస్తులకు సచివాలయంలో నిత్యం ఏదో ఒక అవసరం ఉంటుంది. వారి అవసరాల నిమిత్తం వెళ్లిన వారికి ఎదురుచూపులు, నిరాశే మిగులుతోందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి అధికారులు సకాలంలో విధులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.