జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రం అభివృద్ధి

జగన్మోహన్ రెడ్డి తోనే రాష్ట్రం అభివృద్ధి
ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
మహానంది, జూలై 11, (సీమకిరణం న్యూస్) :
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గొప్ప ఆలోచనతో రాష్ట్రం మొత్తం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువవుతుందని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. మంగళవారం మహానంది మండల పరిధిలోని అబ్బీపురం గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా అర్హత కలిగిన వారికి 11 రకాల ధ్రువపత్రాలను ప్రభుత్వ యంత్రాంగమే మీ దగ్గరికి చేరుస్తుందని ఇలాంటి గొప్ప అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో పాలించిన ప్రభుత్వాలలో ఏదైనా దృవపత్రం కావాలంటే మండల కార్యాలయాల చుట్టూ రోజులు తరబడి తిరిగే వారని జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్లను నియమించి ప్రజలకు ప్రభుత్వ పాలన దగ్గర చేశారని అన్నారు.అంతే కాకుండా అర్హులకు సంక్షేమ పథకాలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తూ అవినీతి తావులేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఐదు వేలు జీతం కన్నా గౌరవం ముఖ్యమని పని చేస్తున్న వాలంటీర్ల మీద పవన్ దిగజారుడు వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.కరోనా లాక్ డౌన్ సమయంలో ముందుండి ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందించిన ఘనత వాలంటీర్లదని ఎమ్మెల్యే తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శ్రీశైలం నియోజకవర్గంలో 104 రోజులు నిర్వహిస్తే ఎక్కడా కూడా వాలంటీర్ల మీద ప్రజలు ఫిర్యాదులు ఇవ్వలేదని అందుకు ఎమ్మెల్యే గా గర్వపడుతూ వాలంటీర్లను అభినందిస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు ధ్రువపత్రాల కోసం ఇబ్బందులు పడకుండా డబ్బులు, సమయాన్ని ఆదా చేసుకునేందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం వైసీపీ నాయకులు శిల్పా భువనేశ్వర రెడ్డి,గ్రామ సర్పంచ్ శ్రీలక్ష్మి, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు శరబారెడ్డి,ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.