
హఫీజ్ ఖాన్ స్థాయికి మించి మాట్లాడకు : టిజి భరత్
కర్నూలు ప్రతినిధి, జూలై 23, (సీమకిరణం న్యూస్):
ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తన స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టిజి భరత్ అన్నారు. తనపై, తన తండ్రి టీజీ వెంకటేష్ పై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్థాయికి మించి మాట్లాడుతున్నారని.. ఆయనది ఎమ్మెల్యే స్థాయి కాదని, కనీసం కార్పొరేటర్ స్థాయి కూడా కాదన్నారు. ఆయనకు చేతనైతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ తెచ్చుకోవాలని ఆ తర్వాత ఆయన స్థాయిని బట్టి తాము మాట్లాడుతామని భరత్ అన్నారు. వై.ఎస్ జగన్ గాలిలో కొట్టుకు వచ్చి గెలిచిన ఈయన్ని అందరూ గాలి ఎమ్మెల్యే అంటున్నారని.. హఫీజ్ ఖాన్ ఇప్పుడు ఆయన పదవిని ఎంజాయ్ చేసుకోవాలని సూచించారు. అంతేకానీ ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో ఉన్న టీజీ కుటుంబం గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదని హితవు పలికారు. హఫీజ్ ఖాన్ స్థాయికి మించి మాట్లాడకుండా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు. రానున్న రోజుల్లో ఆయన భవిష్యత్తు ఏమవుతుందో తెలుసుకోవాలని.. హఫీజ్ ఖాన్ ఆయన ఉంటున్న పార్టీకి, కర్నూలుకు చాలా డ్యామేజ్ చేశారన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఫస్ట్ టికెట్ తెచ్చుకోవాలని ఆ తర్వాత ఆయన చెప్పే ప్రతి దానికి సమాధానం చెబుతానని భరత్ తెలిపారు. హఫీజ్ ఖాన్ అంటున్న ప్రతి మాటకు తమ దగ్గర జవాబు ఉందని టిజి భరత్ చెప్పారు. హఫీజ్ ఖాన్ సక్రమంగా పనిచేయనందుకే.. వాళ్ళ పార్టీ అధిష్టానం కర్నూలులో మరో ఇద్దరు నేతలను ప్రోత్సహిస్తుందన్నారు. హఫీజ్ ఖాన్ ఆయన తండ్రిని చూసి హుందాతనం నేర్చుకోవాలని భరత్ సూచించారు. గత ఎన్నికల సమయంలో ఆయన తండ్రి తనతో మాట్లాడుతూ ఎన్నికల్లో తాను గెలిచినా, హఫీజ్ ఖాన్ గెలిచినా తనకు ఒకటేనని చెప్పారని.. ఇద్దరమూ ఆయన కొడుకుల్లాంటి వాళ్ళమని చెప్పే హుందాతనం ఉన్న వ్యక్తి అని హఫీజ్ ఖాన్ తండ్రి గురించి భరత్ చెప్పారు. ఆయన తండ్రి సంస్కారంగా మాట్లాడితే ఈయన అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని టిజి భరత్ తెలిపారు. ఇంట్లో ఉన్న ఆయన తండ్రిని చూసి హఫీజ్ ఖాన్ హుందాతనం నేర్చుకోవాలన్నారు.