
మణిపూర్ ఘటన నిందితులకు ఉరిశిక్షలు విధించాలి
రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాష్ నాయక్ డిమాండ్
కర్నూలు టౌన్, జూలై 24, (సీమకిరణం న్యూస్):
గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన జరిగి మూడు నెలలు గడుస్తున్నా నిందితులపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అర్ కైలాష్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కైలాష్ నాయక్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్నప్పటికి మణి పూర్ రాష్ట్రంలో మహిళలను నగ్నంగా ఊరేగింపు ఘటన యావత్ దేశమే తలదించుకునే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని (కుకి) తెగకు చెందిన మహిళలను (మొయీలి) ఇతర కులాల వారు మహిళలు అని కూడా చూడకుండా బలవంతంగా వివస్త్రలను చేసి గుంపులుగా ఏర్పడి అక్కడి ప్రధాన రహదారుల గుండా ఊరేగించడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న పోలీసు వాహనం, అందులో ఇద్దరు పోలీసులు ఒక డ్రైవరు ఉన్నప్పటికీ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటం క్షమించరాని నేరం అని అన్నారు. ఆ సమయంలో మహిళా తండ్రి, సహోదరుడిని ఇద్దరినీ కూడా చంపి పక్కనే కాలువలో పడేయడం దారుణం అన్నారు. దేశాన్ని పాలించే బిజెపి పార్టీ, రాష్ట్రాన్ని కూడా పరిపాలించే బిజెపి పార్టీ బాధితులకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలం చెందిందన్నారు. ఇలాంటి సంఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ దేశ హోం శాఖ మంత్రి అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కైలాష్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళ రాష్ట్ర నాయకురాలు పట్నం రాజేశ్వరి, నంది విజయలక్ష్మి, షెడ్యూల్ ట్రైబ్స్ ఫెడరేషన్ జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.