కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను మత్స్యకార కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన
సూపర్ రెస్టారెంట్ ప్రారంభించిన పత్తికొండ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్
కర్నూలు కలెక్టరేట్ / వెల్దుర్తి , నవంబర్ 21, (సీమకిరణం న్యూస్) :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను మత్స్యకార కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన పేర్కొన్నారు. మంగళవారం వెల్దుర్తి మండల కేంద్రంలో లద్దగిరి ఎక్స్ రోడ్డు దగ్గర ఫిష్ ఆంధ్ర సూపర్ రెస్టారెంట్, మరియు లైవ్ ఫిష్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను మత్స్యకార కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.పోషక విలువ కలిగిన చేపలను వినియోగించడం ఆరోగ్యానికి చాలా మంచిదన్నారు. సూపర్ రెస్టారెంట్ ప్రారంభించిన అనంతరం రెస్టారెంట్ లోని పదార్థాలను కూడా రుచి చూడడం జరిగిందని, ఇదే నాణ్యతతో వచ్చే కస్టమర్లకు కూడా ఫుడ్ ను అందించాలన్నారు. ఇతర ఆహారాలతో పోలిస్తే చేపల్లో అత్యుత్తమమైన ప్రోటీన్ లభిస్తుందన్నారు. జిల్లాలో మత్స్య సంపద అధికంగా ఉందని, వినియోగం పెరిగితే మత్స్యకారులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ చేపలు, రొయ్యలు, ఆరోగ్యానికి చాలా శ్రేష్టమని, ఇలాంటి రెస్టారెంట్ల వల్ల రుచికరమైన రకరకాల చేపలు ఫుడ్ అందుబాటులో ఉంటుందన్నారు. వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ చేపలు తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను అందరికీ తెలియజేయాలని, చేపల పెంపకాన్ని మరింత ప్రోత్సహించాలన్నారు. కొత్త సాంకేతికను ఉపయోగించుకుని చేపలను నాణ్యతగా తయారు చేసుకోవాలని, వాటికి మార్కెట్ ధర కూడా బాగుంటుందన్నారు. రైతులు ముందుకు వస్తే మరిన్ని మినీ ఫిష్ ఔట్ లెట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని దీని ద్వారా మంచి లబ్ధి పొందవచ్చన్నారు. మత్స్యశాఖ అధికారి శ్యామలమ్మ మాట్లాడుతూ ఫిష్ ఆంధ్ర సూపర్ రెస్టారెంట్ ఏర్పాటుకు యూనిట్ కాస్ట్ 20 లక్షల రూపాయలు కాగా, అందులో లబ్ధిదారుని వాటాగా 8 లక్షల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా 60 శాతం అనగా 12 లక్షలు సబ్సిడీ అందించామని తెలిపారు. లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్ కొరకు ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడ లబ్ధిదారునికి ఈరోజ అందజేయడం జరిగింది అన్నారు. యూనిట్ కాస్ట్ 20 లక్షలు, లబ్ధిదారుని వాట 12 లక్షలు కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా 40 శాతము అనగా ఎనిమిది లక్షలు అందజేయడం జరిగిందని జిల్లా మత్స్యశాఖ అధికారి శ్యామలమ్మ తెలియజేశారు. కార్యక్రమంలో ఫిషరీస్ ఇన్స్పెక్టర్ బాలరాజు, FDO స్వర్ణలత,FA మంజుల, తదితరులు పాల్గొన్నారు.