బహుళ ప్రయోజనాల భవన నిర్మాణాలను వేగవంతంగా నిర్మించండి
జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
కర్నూలు కలెక్టరేట్, డిసెంబర్ 12, (సీమకిరణం న్యూస్) :
బహుళ ప్రయోజనాల నిర్మాణాల భవనాలు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి కో-ఆపరేటివ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన 102 బహుళ ప్రయోజనాల భవన నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం 35 మాత్రమే పూర్తి చేశారన్నారు. 18వ తేది నాటికి మరో 35 బహుళ ప్రయోజనాల భవన నిర్మాణాలను పూర్తి కావాలన్నారు. 25వ తేది నాటికి బేస్మెంట్ స్థాయిలో ఉన్న మిగిత గోదాములు పూర్తి చేసి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ డిఈ ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా పూర్తి అయిన బహుళ ప్రయోజనాల భవన నిర్మాణాలను సొసైటీ వారికి అందజేసిన తరువాత రైతులు పండించిన పంట నిల్వలను నిల్వ చేసుకోవడంతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖలైన వ్యవసాయ, మత్స్యశాఖ, హార్టికల్చర్, సివిల్ సప్లైస్ వారికి సాధారణ రుసుముతో అద్దెకు ఇచ్చే అవకాశం ఉంటుందని డిసిఓ జిల్లా కలెక్టర్ కు వివరించారు. సిసిఆర్సి కార్డుల ద్వారా కౌలు రైతులకు రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డిసిఓను ఆదేశించగా ఇప్పటి వరకు పసుపల సొసైటీ నుండి 34 మంది కౌలు రైతులకు 15 లక్షలు, ఉల్చాల సొసైటీ నుండి 30 మందికి కౌలు రైతులకు 12 లక్షల ఋణాలు మంజూరు చేశామని డిసిఓ జాయింట్ కలెక్టర్ కు వివరించారు. సమావేశంలో డిసిఓ రామాంజనేయులు, కెడిసిసి బ్యాంకు సిఈఓ రామాంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, మార్కెటింగ్ ఏడి నారాయణమూర్తి, జిల్లా హార్టికల్చర్ అధికారి రామాంజనేయులు, మార్కెటింగ్ ఇంజనీర్లు, ఓర్వకల్లు, పసుపల, ఉల్చాల సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.