ఉన్నతి – మహిళా శక్తి పధకం క్రింద మహిళలకు జీవనోపాధి
జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్
నంద్యాల, డిసెంబర్ 07, (సీమకిరణం న్యూస్) :
మహిళల జీవనోపాధి మెరుగుపరిచేందుకు “ఉన్నతి-మహిళా శక్తి” పథకం కింద మహిళా లబ్ధిదారులకు ఆటోలు పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో ఉన్నతి – మహిళాశక్తి పథకం కింద ఆటోలను పంపిణీ చేసి జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డిలు ఆటో ర్యాలీని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాయింట్ జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ఉన్నతి – మహిళాశక్తి పథకం కింద తొలివిడతలో ఎస్సి మరియు ఎస్టీ నిరుపేద మహిళలకు ఈ ఆర్థిక సంవత్సరం వడ్డీ లేని రుణాల ద్వారా 9 మంది మహిళలకు ఆటోలు మంజూరు చేసి పంపిణీ చేయడం జరిగిందన్నారు. వెలుగోడు, అవుకు మండలాల మహిళల జీవనోపాదులు మెరుగుపరిచేందుకు ఉన్నతి కార్యక్రమం కింద ఆటోలు పంపిణీ చేశామని లబ్ధిదారుల సబ్సిడీ వాటా పోను మిగిలిన మొత్తానికి ప్రతినెల తేలిక వాయిదా పద్ధతుల ప్రకారం 48 నెలల పాటు చెల్లించాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్తులో మరి కొంతమంది ఔత్సాహిక మహిళా లబ్ధిదారులకు ఆటో యూనిట్ల పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆటోలు మరియు లబ్ధిదారులు తప్పనిసరిగా బీమా చేయించాలన్నారు. ఉన్నతి పథకం కింద అందించిన ఆటోలను లబ్ధిదారులు చక్కగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లు లబ్ధిదారుని ఆటోలో ఎక్కి ఆవరణలో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి, ఏపిడీలు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.