గుండె సమస్యలపై అలసత్వం చేయవద్దు
ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి.చంద్రశేఖర్
కర్నూలు వైద్యం, జనవరి 08, (సీమకిరణం న్యూస్) :
ఏ వయసు వారైనా గుండె సమస్యలపై అలసత్వం వహించరాదని కర్నూలు హార్ట్ ఫౌండేషన్ సెక్రెటరీ మరియు ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె జయమ్మ తో కలసి కార్డియాలజిస్ట్, కర్నూలు హార్ట్ ఫౌండేషన్ సెక్రెటరీ డా.చంద్ర శేఖర్ ప్రారంభించారు. కార్డియాలజిస్ట్ డా.పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ సమాజంలో ఏ వయసు వారైనా గుండె సమస్యలపై అలసత్వం వహించరాదని అన్నారు. ముఖ్యంగా జర్నలిస్టు వృత్తిలో ఉన్నవారు అధిక ఒత్తిళ్లకు గురి అవుతుంటారని కావున జర్నలిస్టుల కొరకు ప్రతి నెలలో మొదటి ఆదివారం హెల్త్ క్యాంపులు నిర్వహించడం లో భాగంగా జర్నలిస్టుల కోసం ఈ వారం నిర్వహించామని తెలిపారు. ఇలాంటి క్యాంపులను జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈరోజు నిర్వహించిన ఉచిత గుండె వైద్య శిబిరంలో దాదాపు 150 మందికి గుండె పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ క్యాంపులో బిపి, షుగర్, ECG, 2D-ECHO పరీక్షలను ఉచితంగా చేయడం తో పాటు కార్డియాలజిస్టుల చేత కన్సల్టేషన్ ఉచితంగా అందించారు. డాక్టర్ భవాని ప్రసాద్, డాక్టర్ శంకర్ శర్మ ,డాక్టర్ మహేష్ లు మాట్లాడుతూ తక్కువ వయసు గలవారు కూడా గుండె సంబంధిత సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, మితిమీరిన ఆల్కహాల్, జంక్ ఫుడ్స్, కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోవడం, సరైన నిద్రసమయాలను కూడా పాటించకపోవడం వల్ల గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోతుందని, దీని వల్ల హార్ట్ఎటాక్, ప్రధాన రక్తనాళ సమస్యలు వస్తున్నాయన్నారు. అలాగే ఈ మధ్యకాలంలో అధికంగా జిమ్ చేయడం వల్ల కూడా ప్రాణాలు కోల్పోతున్నారని, అధికంగా ఏది చేసినా… ఇబ్బందే అని, కాబట్టి ప్రతి ఒక్కరూ వైద్యులు పర్వవేక్షణలో నడుచుకోవాలని ఆయన పేర్కొన్నారు.. క్రమం తప్పకుండా వ్యాయామం, వాకింగ్ చేయడం ఉత్తమమని, దీని వలన అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని, . బిపి, బరువును అదుపులో ఉంచుకోవాలని, ఛాతీలో నొప్పి రావడం, అధికంగా చెమటలు పట్టడం, కొద్దిదూరం నడిచినా.. ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్యుల వద్దకు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మీసాల రామస్వామి, ప్రసాద్ ,రమేష్, చెన్నయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.