సమాజ ప్రగతిలో జర్నలిస్టుల పాత్ర కీలకం : డా.చంద్రశేఖర్
కర్నూలు వైద్యం, డిసెంబర్ 08, (సీమకిరణం న్యూస్) :
నేటి సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే జర్నలిస్టుల పాత్ర కీలకమని కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి, ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్ అన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎ.క్యాంప్ లోని హెల్త్ క్లబ్ లో జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో విధినిర్వహణ చేయడం జర్నలిస్టులకే సాధ్యమని అన్నారు. తీవ్రమైన ఒత్తిళ్ళ నడుమ విధి నిర్వహణ చేస్తున్న జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని డా. చంద్రశేఖర్ కోరారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సమాచారశాఖ డిప్యూటీ డైరెక్టర్ జయమ్మ మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టుల కోసం కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ప్రత్యేకంగా ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. దాదాపు మూడు వేల రూపాయలు విలువైన ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తూ జర్నలిస్టులకు ఆరోగ్యపరంగా కర్నూలు హార్ట్ ఫౌండేషన్ అండగా నిలిచిందని ఆమె అన్నారు. ఈ సందర్బంగా డా. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కార్డియాలజిస్టులు డా.లలితకుమారి, డా.మహేష్ తదితరులు జర్నలిస్టులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో అరవై మందికి 2 డి ఎకో పరీక్షలు, 95 మందికి ఈసీజీ ,110 మందికి లిపిడ్ ప్రొఫైల్, 150 మందికి బ్లడ్ షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హార్ట్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు డా. భవానీ ప్రసాద్, డా. శంకరశర్మ, డా.సాయికుమార్, ఫౌండేషన్ సభ్యులు నాగేశ్వరబాబు, ఎలియాజర్, వాసుదేవమూర్తి , కార్డియాలజి నిపుణుల బృందం, నర్సింగ్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.