కర్నూలు నుండి పోటీకి సిద్ధం..!!
ముస్లింలలో రాజకీయ చైతన్యం
కర్నూలు ప్రజల అభివృద్దే లక్ష్యం : అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ సత్తార్
కర్నూలు ప్రతినిధి, జనవరి 12, (సీమకిరణం న్యూస్) :
ఆయన గుండెకు ధైర్య మెక్కువ… ఆయన కలానికి పదునెక్కువ… సంచలన వార్తలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన జర్నలిస్టు ధీరుడాయన.. విద్యార్థి దశ నుండే సమస్యల పరిష్కారానికై పోరాడిన ఉద్యమకారుడాయన..ముస్లింలలో రాజకీయ చైతన్యం ,హక్కుల సాధన కోసం గొంతెత్తి చాటిన మైనార్టీల ముద్దుబిడ్డ ఆయన… ముళ్ళు ,రాళ్లు అవాంతరాలు ఎన్ని ఎదురైనా ముందు దారి తనదంటూ… వెనుకడుగు వేయకుండా రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న యువ కెరటం ఆయన …చీకటి నిండిన ముస్లిం సమాజంలో రాజకీయ చైతన్యం నింపి ,సామాజిక, ఆర్థిక రంగాల్లో ముస్లింలను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్న ముస్లిం ధీరుడాయన…నేను బ్రతకడానికి కాదు… పేదల బ్రతుకులు మార్చేందుకే రాజకీయాల్లోకి వచ్చాను..!! అంటూ కర్నూలు నుండి ఎన్నికల బరిలోకి దిగబోతున్న ముస్లింమైనారిటీ నేత, సీనియర్ జర్నలిస్టు, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ సత్తార్ (ఏ ఎస్ ఆర్) పై ఓ ప్రత్యేక కథనం….
సరిగ్గా పాతికేళ్ల క్రితం అతికొద్దిమంది విలేకరులు ఉన్న ఆరోజుల్లో కర్నూలు నగరంలోని పాతబస్తీ ఇరుకు సందుల్లో సమస్యలు ఏ కరువు పెట్టేవి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక… సమస్య పరిష్కారానికి నోచక సతమతమయ్యేవారు. అప్పుడే సరిగ్గా ఓ పదిహేడేళ్ల నూనూగు మీసాల నవయువకుడు నిత్యం సైకిల్ పై నగరంలోని పాత బస్తీ సందుల్లో తిరిగేవాడు. సమస్య ఎక్కడుంటే అక్కడ నేనుంటానంటూ ప్రజల పక్షాన నిలిచేవాడు. ప్రతి ప్రజా సమస్యను తాను పనిచేస్తున్న అప్పటి ఈనాడు దినపత్రికలో వార్తగా రాసి పరిష్కారం చూపేవాడు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేవరకు శ్రమించేవాడు. తాను కలంతో చేసే పని వల్ల పేదల కళ్ళలో ఆనందం చూస్తూ మురిసిపోయేవాడు. పారిశుద్ధ్య సమస్యల నుండి రోడ్లు, కొళాయిలు, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు ,ఇళ్ల స్థలాలు, పక్కా ఇల్లు, పేదరికం, అనారోగ్య సమస్యలతో పాతబస్తీ దాటి రాని పేదల బాధలను ఆయన వార్తలు రాసి సమాజం ముందు పెట్టి మానవతామూర్తులచే సాయం అందించేలా కృషిచేసిన కలం శ్రామికుడు. విలేకరిగా ఎంతోమంది పేదల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేసి ,ఎస్సీ ఎస్టీ, బీసీ ,ముస్లిం పేదల పక్షాన వార్తలు రాసి ప్రజా విలేకరిగా మన్ననలు పొందిన ఆనాటి నూనూగు మీసాల నవ యువకుడే ఈనాటి మన ఫైర్ బ్రాండ్ జర్నలిస్టు షేక్ అబ్దుల్ సత్తార్ (ఏ ఎస్ ఆర్.)….
చిన్నప్పటినుండి నాయకత్వ లక్షణాలున్న షేక్ అబ్దుల్ సత్తార్ విద్యార్థి దశ నుండే సిపిఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ లో చేరి విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలు చేసి జిల్లా విద్యార్థి నాయకుడిగా ఎదిగారు .పదవ తరగతి పూర్తి కాగానే సిపిఎం పార్టీలో నందికొట్కూరు నుంచి మంచి కార్యకర్తగా ఎదిగి అనేక ప్రజా పోరాటాలు చేశారు. ఒక్క సిరా చుక్కతో లక్ష మెదుళ్లను స్పందింపచేయొచ్చు అన్న భావనతో పాత్రికేయ వృత్తి ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న సంకల్పంతో1998లో ఇంటర్ పూర్తి కాగానే సిపిఎం పార్టీకి అనుబంధంగా ఉన్న ప్రజాశక్తి దినపత్రికలో విలేకరిగా తన జర్నలిస్టు జీవితాన్ని ప్రారంభించారు. అనతి కాలంలోనే తన ప్రతిభను గుర్తించిన ఈనాడు యాజమాన్యం 1999లో కర్నూల్ నగర ఈనాడు విలేఖరిగా అవకాశం కల్పించడంతో కర్నూలుకు చేరుకున్న అబ్దుల్ సత్తార్ అప్పటినుంచి ఇక్కడే స్థిరపడ్డారు. విద్యార్థి దశ నుండే ఉద్యమ పంథా కలిగిన ఆయన ఈనాడు విలేఖరిగా ఉంటూనే ప్రజల పక్షాన అనేక వార్తలు రాసి యాజమాన్యం తో పాటు ప్రజల మన్ననలు పొందారు. అప్పుడే (1999లో) రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ మొట్ట మొదటిసారిగా తాను కర్నూలు ఎమ్మెల్యేగా గెలవడానికి అప్పటి ఈనాడు విలేఖరి అబ్దుల్ సత్తార్ ఎంతో సహకరించారని పలు సందర్భాల్లో బహిరంగంగా వ్యాఖ్యానించారంటే సత్తార్ పనితీరు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. పేద కుటుంబం నుంచి వచ్చిన వారికే పేదల బాధలు తెలుస్తాయన్నట్లు సత్తార్ ఎల్లప్పుడూ పేదల బాధలపైనే ఎక్కువగా మానవతా దృక్పధ వార్తలు రాసేవారు. ఉద్యమ నేపథ్యం కలిగిన అబ్దుల్ సత్తార్ ఇటు కర్నూలు చేరాక జర్నలిస్టు సంఘాల్లోనూ చురుకైన పాత్ర పోషిస్తూ 1999లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడిగాను, 2002లో జాప్ జిల్లా అధ్యక్షుడిగాను, రాష్ట్ర కార్యదర్శి గాను ఎన్నికై జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు అప్పటి కలెక్టర్ అజయ్ జైన్ తో ఓ సర్కులర్ ఇప్పించి జర్నలిస్టుల్లో తిరుగులేని నాయకుడిగా అభిమానం సంపాదించారు. కర్నూల్ లోప్రెస్ క్లబ్ ఏర్పాటు కోసం పోరాడారు .మీడియా ముసుగులో కొందరు అవినీతి విలేకరులు మాఫియాగా తయారై పలువురు ప్రభుత్వాధికారులను తన గుప్పెట్లో ఉంచుకొని ఏకచత్రాధిపత్యం చెలాయిస్తున్న జర్నలిస్టు మాఫియాపై వార్తలు రాసి, సంచలనం సృష్టించి, తిరుగులేని పోరాటం చేశారు. 2002 నుండి 2007 వరకు మా టీవీ , స్టార్ న్యూస్ ఛానల్ , మున్సిఫ్ ఉర్దూ దినపత్రికలో రాయలసీమ జిల్లాల ప్రధాన విలేకరిగా పనిచేసి ఎన్నో సంచలన వార్తలు రాసి జాతీయ ఆంగ్ల పత్రికల్లో తన వార్తలపై ప్రముఖులు విశ్లేషించే స్థాయికి చేరుకున్నారు .కర్నూలు నగరంలోని మైనార్టీల సమస్యలపై ఎన్నో మానవతా దృక్పధ వార్తలు రాసి మైనార్టీలు గుండెల్లో గుర్తించుకునే జర్నలిస్టుగా నిలిచారు .2007లో తానే సొంతంగా రాయలసీమ టైమ్స్ అనే పత్రిక తో పాటు రాయలసీమ జర్నలిస్టు సంఘం (రాజసం)స్థాపించి అనేక సంచలన వార్తలు ప్రచురించి ,పలువురు రాజకీయ నాయకులు ,అవినీతి అధికారుల పాలిట సింహ స్వప్నంలా నిలిచారు. ముస్లిం మైనారిటీల్లో రాజకీయ చైతన్యం కోసం ముస్లిం పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (MPFI) అనే రాజకీయేతర స్వచ్ఛందసంస్థను స్థాపించి, పలువురు ముస్లిం ప్రముఖులతో కలిసి ముస్లిం సాధికార ఉద్యమం, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ ఉద్యమం చేపట్టారు. కర్నూలు నుండి కరీంనగర్ వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముస్లిం సాధికారత ఉద్యమ బాట పట్టి సమావేశాలు నిర్వహించారు. ఎందరో ప్రముఖులు ఆయన ఉద్యమానికి మద్దతు పలికారు. ముస్లింల దీనస్థితిని నిగ్గు తేల్చిన జస్టిస్ రాజేంద్రసచార్ కమిటీ నివేదికను చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ చేసిన సిఫారసులను పార్లమెంటులో బిల్లు రూపంలో ఆమోదించి చట్టం చేయాలని ఉమ్మడి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అబ్దుల్ సత్తార్ సంతకాల సేకరణ ఉద్యమంతో పాటు పాదయాత్రలు నిర్వహించారు. కర్నూల్ నగరంలో 2008లో వాడవాడలా పర్యటించి పలు మసీదుల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, ముస్లింలకు రిజర్వేషన్లపై అవగాహన కల్పించేవారు .అప్పట్లో ఈ ఉద్యమానికి మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి సైతం సంఘీభావం తెలిపి అబ్దుల్ సత్తార్ కు మద్దతు పలికారు. ఈ ఉద్యమ కాలంలో పలువురు మైనార్టీ వ్యతిరేకులు ఆయనపై తప్పుడు కేసులు పెట్టి వేధించినా మొక్కవోని ధైర్యంతో అబ్దుల్ సత్తార్ ముందుకు సాగారు. 2009 ఎన్నికల నాటికి ముస్లిం జనాభా అధికంగా ఉన్న అన్ని అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో ముస్లిం అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలిసి అభ్యర్థించారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి కర్నూలు ,నంద్యాల అసెంబ్లీ స్థానాల్లో ముస్లిం అభ్యర్థులని పోటీకి నిలపాలని విన్నవించారు. ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సోదరుడు మోయిజ్ ఖాన్ కు ప్రజారాజ్యం పార్టీలో కర్నూలు అసెంబ్లీ టికెట్ ఇప్పించేందుకు ఆయన తీవ్రంగా శ్రమించినా కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకుంటే స్వతంత్రంగా అభ్యర్థులను పోటీకి నిలుపుతామని అన్ని పార్టీలకుఅల్టిమేటం జారీ చేశారు. కాగా 2009 ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ సీటు ముస్లిం అభ్యర్థికి కేటాయించలేదు .అయితే సిపిఎం నుండి ముస్లిం అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే గఫూర్ కర్నూలు నుండి పోటికి నిలవడంతో ,ముస్లిం ఓట్లు చీలకుండా అబ్దుల్ సత్తార్ 2009 ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న నంద్యాల పార్లమెంటు స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి నిలిచారు .ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి యన్ యం డి ఫరూక్ చివరి నిమిషంలో ఎంపీ స్థానానికి నామినేషన్ వేయడంతో పలువురు మత పెద్దలు అబ్దుల్ సత్తార్ ను ఓట్లు చీల్చకుండా చూడాలని సూచించారు .దీంతో ఆయన నామమాత్రంగా ప్రచారం చేసినా ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే చిన్న పార్టీలు ,స్వతంత్ర అభ్యర్థులు అందరికంటే ఎక్కువగా సుమారు 7వేలకు పైగా ఓట్లు సాధించి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మకు మీడియా సలహాదారుడిగా సేవలందించిన అబ్దుల్ సత్తార్ ఇంటర్ విద్య అనంతరం పాత్రికేయ వృత్తిలోకి అడుగుపెట్టి ఆర్థిక పరిస్థితుల దృశ్యా కొంతకాలం తన విద్యాభ్యాసానికి పుల్ స్టాప్ పెట్టారు .ఆ తర్వాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్య ద్వారా రాజనీతి శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి, హైదరాబాద్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి జర్నలిజంలో పీజీ (ఎంసీజే )ను పూర్తి చేశారు. రాష్ట్ర విభజన అనంతరం2014 సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడంతో అప్పటి ముఖ్యమంత్రి జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా అబ్దుల్ సత్తార్ పోరాట పటిమ తెలుసుకొని కర్నూలు ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం ఇచ్చారు. అయితే చివరి నిమిషంలో జై సమైక్యాంధ్ర పార్టీతో సిపిఎం పార్టీ పొత్తు కుదుర్చుకోవడంతో అబ్దుల్ సత్తార్ మళ్లీ కర్నూలు ఎమ్మెల్యే సీటును త్యాగం చేయాల్సి వచ్చింది .దీంతో ముస్లింలు అధికంగా ఉన్న శ్రీశైలం అసెంబ్లీ స్థానం నుండి ఆయన జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున 2014లో పోటీ చేసి మంచి గుర్తింపు సాధించారు. తాను అధిక ఓట్లు సాధించకున్నా… ప్రత్యర్థులకు ఓట్లు రాకుండా తనదైన శైలిలో విమర్శలు చేసి ,ప్రజలను ఆలోచింపజేసేలా ఎన్నికల ప్రచారం నిర్వహించడం లో అబ్దుల్ సత్తార్ దిట్ట అని పేరు పొందారు. 2017 లో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణాంతరం జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అబ్దుల్ సత్తార్ ,సీనియర్ రాజకీయవేత్త బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్ని తానై నిలిపిన అభ్యర్థి కంటే మూడు రెట్లు అధికంగా ఓట్లు సాధించి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పార్టీ మూసివేతకు పరోక్ష కారణంగా నిలిచారు . 2019 ఎన్నికల్లో కర్నూల్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా అబ్దుల్ సత్తార్ పోటీ చేసినప్పటికీ మైనార్టీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ పోటీలో ఉండడంతో నామ మాత్రంగానే ప్రచారం నిర్వహించారు. మూడుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగాను, ఒకసారి ఎంపీ అభ్యర్థిగాఎన్నికల్లో పోటీ చేసిన అబ్దుల్ సత్తార్ ఎన్నికల ప్రచారం పై పూర్తి అవగాహన కలిగి ఉండడంతో ఈసారి మంచి ఫలితాలు సాధించే విధంగా గట్టిగా పోటీలో నిలవాలని ముమ్మరంగానే ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే 2019 ఎన్నికల అనంతరం ఆయన అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు.ప్రస్తుతం అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న అబ్దుల్ సత్తార్ నిజమైన వైయస్సార్ అభిమానుల పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అంటారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనిది “యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ” మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు .ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ సీఎం జగన్ తమ పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు ను వాడుకుంటున్నారని ,జగన్ పార్టీని రద్దు చేయాలని తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా తో కలిసి 2020లో ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. దీంతో పలువురు వైకాపా అభిమానులు ఆయనపై పలు అక్రమ కేసులు బనాయించి, దాడులకు సైతం పాల్పడ్డారు. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగితే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అభ్యర్థులకు భారీగా నష్టం వాటిల్లి ఓట్లు చీలే అవకాశం ఉండడంతో ఆ పార్టీ నాయకులు ,కార్యకర్తల నుండి అబ్దుల్ సత్తార్ అనేక సందర్భాల్లో తీవ్ర బెదిరింపులు,వేధింపులు ఎదుర్కొన్నారు.దీనిపై తనకు ప్రాణ రక్షణ కల్పించాలని రాష్ట్ర డిజిపి కి ఫిర్యాదు చేసి అబ్దుల్ సత్తార్ చట్టపరంగా పోరాడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం ఎన్నికల కమిషన్ పరిశీలనలో ఉందని అంతిమ విజయం తమదేనని అబ్దుల్ సత్తార్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టుగా , విద్యార్థి నాయకుడిగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, ఉద్యమాలు నిర్వహించిన అబ్దుల్ సత్తార్ ను ఆయన అభిమానులు వివిధ రకాల పేర్లతో పిలుచుకుంటారు. కాలేజీలో చదివే రోజుల్లో ఆయన విద్యార్థుల కోసం చేసిన పోరాటాలు చూసి క్లాస్మేట్స్ అందరూ ఆయనను” సత్తార్ పటేల్” అని పిలుచుకునేవారు. మాటీవీలో పని చేసి మంచి జర్నలిస్టుగా గుర్తింపు పొందడంతో చాలామంది ఇప్పటికీ “మా టీవీ సత్తార్” అని, మైనార్టీ యువకుల్లో ధైర్యంగా ముందడుగు వేసి యువతకు ఆదర్శంగా నిలవడంతో పలువురు మైనారిటీ యువకులు ఆయనను “టైగర్ భాయ్” అని, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో అగ్ర నాయకుడిగా గుర్తింపు పొందడంతో ఆ పార్టీ శ్రేణులు ఆయనను “ఏ ఎస్ ఆర్ “అని అభిమానంగా పిలుచుకుంటుంటారు. కర్నూల్ నగరంలో వివిధ ప్రాంతాల్లో అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూనెమ్మదిగా తన వర్గాన్ని విస్తరిస్తూ పోతున్నారు. మైనార్టీ నేతగా, సీనియర్ జర్నలిస్టుగా తనకున్న పాత పరిచయాల నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కర్నూలు అసెంబ్లీ స్థానంలో తో పాటు కర్నూలు పార్లమెంటు స్థానంలో కూడా పోటీ చేసి తన సత్తా చాటాలని షేక్ అబ్దుల్ సత్తార్ జోరుగా పావులు కదుపుతున్నారు .ఇప్పటికే తటస్థులైన పలువురు ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ నాయకులను , మత పెద్దలనుకలిసి వచ్చే ఎన్నికల్లోతనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమిలో తమ పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేర్చుకొని పొత్తులో భాగంగా తనకు కర్నూలు ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్ర రాజు తోను చర్చలు జరిపారు. గత ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుండి నామమాత్రంగా పోటీ చేసిన అబ్దుల్ సత్తార్ ఈసారి గట్టిగా పోటీలో నిలిచి తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో బాబు, జగన్, పవన్ పార్టీలన్నీ కేంద్రంలోని మతోన్మాద బిజెపికి ఊడిగం చేస్తున్నాయని ,ఈ పార్టీలలో ఎవరికి ఓటు వేసిన అది బిజెపికే చేరుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రజలందరూ ఆలోచించి మతోన్మాద బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటే తనలాంటి నూతన అభ్యర్థులను గెలిపించి ఆశీర్వదించాలని కోరుతున్నారు. పాతికేళ్లుగా కర్నూల్ నగరంలోని ముస్లిం మైనారిటీలతోపాటు ఎస్సీ ,ఎస్టీ బీసీ ,వర్గాలు కూడా తాను మీడియా ద్వారా చేసిన సామాజిక ప్రజాసేవను గుర్తించుకొని ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉన్నా లేకున్నా తాను మాత్రం అన్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గానే కర్నూల్ నుండి ఎన్నికల బరిలో తప్పక నిలుస్తానని షేక్ అబ్దుల్ సత్తార్ (ఏ ఎస్ ఆర్) స్పష్టం చేస్తున్నారు. జనం మెచ్చిన జర్నలిస్టుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు ఉద్యమాలు చేసిన అబ్దుల్ సత్తార్ రాజకీయాల్లోనూ జనం మెచ్చే ప్రజా నాయకుడిగా ఎదిగి ప్రజల ఆశీస్సులు పొందాలని ఆశిద్దాం.