డోన్ లో కోట్ల దంపతుల రాజకీయ మార్క్
-:ఆర్థికమంత్రి బుగ్గనకు బిగ్ షాక్
-: ఫలించని బుజ్జగింపులు
-: నేడు సైకిలెక్కనున్న మున్సిపల్ వైస్ చైర్మన్ హరికిషన్
కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 03, (సీమకిరణం న్యూస్):
తెలుగుదేశం పార్టీ కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డికి డోన్ అసెంబ్లీ అభ్యర్ధిగా ప్రకటించినప్పటి నుండి కోట్ల దంపతుల మార్క్ కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకలు పేర్కొంటున్న మాట.
కోట్ల దంపతుల మార్క్ తో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి డోన్ నియోజకవర్గంలో గట్టి ఎదురుదెబ్బే తగిలింది. వైసిపి అధికారంలో ఉన్నా, లేకున్నా మొదటి నుంచి ఆర్థిక మంత్రికి కుడి భుజంగా ఉండి అన్ని రకాలుగా వైసిపికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చిన మున్సిపల్ వైస్ చైర్మన్ కె.హరికిషన్ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సుజాతమ్మ సమక్షంలో 4న సైకిలెక్కడానికి తన అనుచరగణంతో రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
———
అడుగడుగునా అవమానాలు భరించలేకే
హరికిషన్ – మున్సిపల్ వైస్ చైర్మన్
————–
వైసిపి అధికారంలో లేక ముందు నుండి పార్టీని అంటి పెట్టుకుని ఎన్నో కష్టనష్టాలను, కేసులు ఎదుర్కొని పార్టీకి అండగా నిలబడితే అధికారం లోకి వచ్చాక సముచిత స్థానం కల్పిస్తామన్న ఆర్థిక మంత్రి బుగ్గన మాటలు నీటి మీద రాతలే అయ్యాయని హరికిషన్ వర్గీయులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. తమ నాయకుడికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని భరోసా ఇచ్చి మొండి చేయి చూపడం, పార్టీలో ఎటువంటి ప్రజాదరణ లేని వారికి అగ్రస్థానం ఇవ్వడం, ప్రస్తుత నూతన కట్టడాలకు పేర్లు మార్చడం వంటి విధానాల పట్ల హరికిషన్ పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే బుగ్గన, ఆయన వర్గీయులు కూడా హరికిషన్ ను పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అటు వైశ్య సామాజిక వర్గంలో మంచి పట్టుండి, పట్టణంలో ఎవరికి ఏ సమస్య వచ్చి పిలిచినా పలికే ముఖ్య నాయకుడిని పోగొట్టుకోవడం వైసీపీకి భారీ నష్టమని హరి అనునయుల పలువురి అభిప్రాయం.
——–
ఫలించని బుజ్జగింపులు:
——————————–
అధికార పార్టీని వదులుతున్న వైస్ చైర్మన్ హరి కిషన్ టీడీపిలోకి మారుతుండడంతో బుజ్జగింపుల పర్వం మొదలైంది. పలువురు వైసీపీకి చెందిన చోట మోట నాయకులు హరికిషన్ ఇంటికెళ్లి, మరి కొంతమంది ఆయన బంధువులకు ఫోన్ల చేసి పార్టీ మారొద్దని బుజ్జగింపులు మొదలుపెట్టారు. ఎవరు ఎంత చెప్పినా వైసిపి అధికారంలో లేనప్పటి నుండి పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు అధికార పార్టీలో తీవ్ర అన్యాయం జరిగిందని అందుకే పార్టీ మారుతున్నట్టు హరికిషన్ వర్గీయులు తెలిపారు.