భూమా – ఇరిగెల కుటుంబాలను కలిపిన బైరెడ్డి
భూమా – ఇరిగెల కుటుంబాలను కలిపిన బైరెడ్డి
-: టీడీపీ అభ్యర్థుల విజయం కోసమే సమన్వయం
రానున్నది టీడీపీ ప్రభుత్వమే
-: టీడీపీ సీనియర్ నాయకులు బైరెడ్డి
కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 10, (సీమకిరణం న్యూస్) :
దశాబ్దాల కాలంగా దూరంగా ఉన్న రెండు కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఏకం చేశారు. బుధవారం కల్లూరు అర్బన్ లోని బైరెడ్డి స్వగృహంలో భూమా – ఇరిగెల కుటుంబాలను పిలిచి చర్చలు జరిపారు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అధ్వర్యంలో జరిగిన చర్చల్లో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, ఇరిగెల రాంపుల్లారెడ్డి కుటుంబాలతో పాటు వారి ముఖ్య అనుచరులు పాల్గొన్నారు. ఈ చర్చలు ఫలించడంతో ఇరు వర్గాలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం అందరం కలసి కట్టుగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ మాట్లాడుతూ, రెండు కుటుంబాల కలయికతో ఎంఎల్ఏ గా తాను, నంద్యాల ఎంపీ అభ్యర్థి గా డా.బైరెడ్డి శబరి భారీ మెజార్టీతో గెలుస్తామని తెలిపారు. కూటమి పార్టీల నేతలతో కలిసి ప్రచారం కొనసాగిస్తామన్నారు. ఇరిగెల రాం పుల్లారెడ్డి మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా కృషి చేస్తామన్నారు. త్వరలో ఉమ్మడి కార్యాచరణపై సమావేశం ఏర్పాటు చేసి జనసేన తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్య క్రమంలో నంద్యాల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి, భూమా – ఇరిగెల కుటుంబ సభ్యులు, వారి అనుచరులు పాల్గొన్నారు.