డిజిటల్ లైబ్రరీ ద్వారా అంధ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు
రాష్ట్రంలోనే మొట్టమొదటి అంధుల డిజిటల్ లైబ్రరీ కర్నూలు జిల్లాలో ఏర్పాటు
డిజిటల్ లైబ్రరీ ద్వారా అంధ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు
జిల్లా కలెక్టర్ డా జి.సృజన
కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 15, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్రంలోనే మొట్టమొదటిదిగా కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన అంధుల డిజిటల్ లైబ్రరీ అంధ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వనుందని జిల్లా కలెక్టర్ డా జి.సృజన పేర్కొన్నారు. సోమవారం స్థానిక బి క్యాంప్ క్వార్టర్స్ విజ్ఞాన్ మందిర్ సమీపంలో ఉన్న జాతీయ అంధుల సమాఖ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వివిధ నిధుల నుండి ముఖ్య ప్రణాళిక అధికారి పర్యవేక్షణలో అంధుల కొరకు ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ ను జిల్లా కలెక్టర్ డా జి.సృజన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతికత కు అనుగుణంగా అందరికీ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొని రావడం ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. దృష్టి లోపం ఉన్న వారికైనా, ఫిజికల్లీ చాలెంజ్డ్ వారికైనా చదువుకునే పుస్తకాల నుండి, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాల నుండి, సాహిత్య పుస్తకాల నుండి మిగిలిన వారిలాగే జ్ఞానం పొందాలన్న ఒక మంచి సంకల్పంతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దృష్టిలోపం ఉన్నవారికి డిజిటల్ లైబ్రరీలో ఉపయోగిస్తున్న టెక్నాలజీ ద్వారా పుస్తకాలను ఆడియో రూపంలో విని చదువుకోవచ్చుననే విషయం గురించి తెలుసుకోవడం ఇది మొదటిసారని కలెక్టర్ తెలిపారు.. అదే విధంగా మనం ఇతరుల కంటే ఎందులో కూడా తక్కువ కాదనే భావన కల్పించుట కొరకు, వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే విధంగా ఈ లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషపడుతున్నానని కలెక్టర్ పేర్కొన్నారు.. ఇటువంటి వాటిని ఇంకా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడం కోసం తప్పకుండా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇంకా చాలామందికి ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తానని కలెక్టర్ తెలిపారు. వివిధ రకాల దివ్యాంగులకు కొత్త సాఫ్ట్వేర్ లు, కొత్త వ్యవస్థలు ఏవైనా ఉన్నా వాటి గురించి తెలుసుకొని ఎవరికి ఎవరికైతే అవసరమో, ఎన్ని రకాల అవసరాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఏం చేయగలుగుతామో తప్పకుండా చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ తెలిపారు. తొలుత అంధుల కొరకు ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ లోని కిబో ఎక్స్ఎస్, ఎల్ఈఎక్స్ ఎయిర్ అనే పరికరాలను పరిశీలిస్తూ వాటిని ఏ విధంగా ఉపయోగించాలి, ఆడియో ఔట్పుట్ ఏ విధంగా వస్తుంది తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం డిజిటల్ లైబ్రరీ కు అవసరమయ్యే 6 కంప్యూటర్లను కూడా అందజేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఓ హిమ ప్రభాకర్ రాజు, సాంఘిక సంక్షేమ శాఖ జెడి రంగ లక్ష్మీదేవి, సిపిఓ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ భారతి, జాతీయ అంధుల సమాఖ్య కర్నూలు శాఖ అధ్యక్షుడు పుష్ప రాజ్, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, సభ్యులు రాఘవయ్య, విశ్వనాథ్ రెడ్డి, కిబో పరికరం శిక్షకుడు తనూజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.