నిర్ణీత గడువులోగా బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియను పూర్తి చెయ్యండి
జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 28, (సీమకిరణం న్యూస్) :
సాధారణ ఎన్నికలు-2024 కు సంబంధించిన బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సంబంధిత అధికారులను అదేశించారు. స్థానిక ఎన్ఆర్ పేటలోని ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణ కార్యాలయంలో సాధారణ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియను కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి భార్గవ తేజతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు – 2024 కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ కు అవసరమైన ముడి సరకు, సిబ్బంది, విద్యుత్ కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రింట్ మరియు స్టేషనరీ కమీషనర్ ను అడుగగా బ్యాలెట్ పేపర్ కు అవసరమైన ముడి సరకు, ప్రింటింగ్ కు అవసరమైన సాంకేతిక సిబ్బంది 150 మంది వరకు ఉన్నారని సంబంధిత అధికారి జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. అదే విధంగా నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి అయిన తరువాత అన్ని జిల్లాల నుంచి ఫైనల్ అయిన అభ్యర్థుల పేర్లు, గుర్తుల జాబితాను అందిన వెంటనే ప్రింటింగ్ ప్రక్రియను పూర్తి చేసి అన్ని జిల్లాలకు బ్యాలెట్ పేపర్లను పంపేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి భార్గవ తేజ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, ప్రింట్ అండ్ స్టేషనరీ కమీషనర్ కిషోర్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎల్.మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.