పింఛన్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు
పెన్షన్ దారులు తమ పెన్షన్ కొరకు గ్రామ వార్డ్ సచివాలయాలకు రావలసిన అవసరం లేదు
నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన
కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 28, (సీమకిరణం న్యూస్):
జిల్లాలోని పెన్షన్ దారులు తమ పెన్షన్ కొరకు గ్రామ వార్డ్ సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలియజేశారు. ఆదివారం సామాజిక భద్రత పింఛన్ పంపిణీ అంశంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ సిఎస్ అజయ్ జైన్, PR&RD ప్రిన్సిపల్ సెక్రెటరీ శశి భూషణ్ కుమార్ సమీక్షించారు. ఈ సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మండలాలు, మున్సిపాలిటీ ల్లోని పింఛన్ దారులు పింఛన్ కొరకు ఎవరూ గ్రామ, వార్డు సచివాలయాలకు రావలసిన అవసరం లేదన్నారు. దివ్యాంగులు, అశక్తులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు,మంచానికే పరిమితమైన వారు, వీల్ చైర్ లో ఉన్న వారు, సైనిక సంక్షేమ పింఛన్ పొందుతున్న వితంతువులకు సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా వారి ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయబడుతుందని కలెక్టర్ తెలిపారు. మిగిలిన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుందని కలెక్టర్ తెలిపారు.. ఎవరికైనా బ్యాంకు ద్వారా చెల్లించే విధానములో సాంకేతిక లోపం ఉంటే, అలాంటివారికి కూడా ఇంటి వద్దనే పింఛన్ చెల్లించబడునని కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయవలసిందిగా తగు చర్యలు తీసుకోవాలని జడ్పీ సీఈవో, డిఆర్డిఏ పిడి, ఎల్ డి ఎం లకు ఆదేశాలు జారీ చేశామని, పింఛన్ దారులు పింఛన్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా పరిషత్ సిఈఓ నాసరరెడ్డి, డిఆర్ డి ఏ పి డి సలీం బాషా తదితరులు పాల్గొన్నారు.