
“వైయస్సార్ అభిమానులందరూ అబ్దుల్ సత్తార్ కే ఓటు వేయాలని పిలుపు”
కర్నూలు నజీర్ ప్రతినిధి, మే 05, (సీమకిరణం న్యూస్):
అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కర్నూలు ఎంపీ, మరియు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అబ్దుల్ సత్తార్ కు ప్రముఖ సినీ నటుడు హీరో సుమన్ మద్దతు పలికారు. తన అభిమానులు, ప్రజలందరూ పేదల పక్షాన పోరాటాలు చేస్తున్న అబ్దుల్ సత్తార్ కు మద్దతు ఇచ్చి ఎన్నికల్లో గెలిపించాలని హీరో సుమన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం కర్నూలుకు వచ్చిన హీరో సుమన్ కు అబ్దుల్ సత్తార్ సుమన్ ఫ్యాన్స్ తో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో యువత రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. పాతికేళ్ల నుండి సీనియర్ జర్నలిస్టుగా, విద్యార్థి ,యువజన, ముస్లిం మైనారిటీ నాయకుడిగా ముస్లింల హక్కుల సాధన కోసం, కర్నూలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్న అబ్దుల్ సత్తార్ కు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలన్నారు. నిజమైన వైయస్సార్ అభిమానిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసం పనిచేస్తున్న అబ్దుల్ సత్తార్ లాంటి నవ యువకులకు కర్నూల్ లోని వైయస్సార్ అభిమానులందరూ ఓటు వేసి గెలిపించాలన్నారు. ఎస్సీ ,ఎస్టీ బీసీ ,ముస్లిం మైనార్టీల పక్షాన ఎన్నో సమస్యల పరిష్కారం కోసం అబ్దుల్ సత్తార్ పనిచేశారని గుర్తు చేశారు. ఇతర పార్టీలకంటే భిన్నంగా అబ్దుల్ సత్తార్ తప్పక పనిచేస్తారని, ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తించుకొని అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ,విజిల్ గుర్తుపై ఓటు వేసి అబ్దుల్ సత్తార్ ను గెలిపించాలని హీరో సుమన్ కర్నూలు అసెంబ్లీ ,పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.