నేడు ఉదయం పోలింగ్ 7 గంటలకు కచ్చితంగా మొదలు కావాలి
ఎలాంటి పొరపాట్లు జరగకుండా పోలింగ్ నిర్వహించాలి
జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన
కర్నూలు కలెక్టరేట్, మే 12, (సీమకిరణం న్యూస్):
మే 13 వ తేదీన 7 గంటలకు పోలింగ్ కచ్చితంగా మొదలు కావాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన అధికారులను ఆదేశించారు.. ఆదివారం రాత్రి పోలింగ్ సన్నద్ధత పై రిటర్నింగ్ అధికారులతో, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో, ఎంపీడీవో, నోడల్ అధికారులు, సెక్టార్ అధికారులతో జిల్లా కలెక్టర్ డా జి.సృజన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 5.30 గంటలకు మాక్ పోల్ మొదలుపెట్టి 6.30 గంటలకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత మాక్ పోల్ లోని ఓట్లను తొలగించి 6:45 కు కంపార్ట్మెంట్లలో మిషన్లను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తర్వాత ఏడు గంటలకు కచ్చితంగా పోలింగ్ స్టార్ట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సెక్టార్ ఆఫీసర్లు ఈరోజు రాత్రి అన్ని పోలింగ్ స్టేషన్లకు వెళ్లి పోలింగ్ స్టేషన్ ఈవీఎం ఎలా కనెక్ట్ చేయాలి, మాక్ పోల్ నిర్వహణ పై వీడియో లు చూసి రిఫ్రెష్ అయ్యేలా పోలింగ్ సిబ్బందికి సూచనలు ఇవ్వాలన్నారు.. సెక్టర్ ఆఫీసర్లు రేపు ఉదయం ఏడు గంటలకే అన్ని పోలింగ్ స్టేషన్లకు వెళ్లి అన్ని మిషన్లు పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.. ఆర్ఓ,ఏఆర్ఓ,సెక్టర్ ఆఫీసర్లు ఏదో ఒక పోలింగ్ స్టేషన్లో మాక్ పోల్ కు అటెండ్ కావాలని కలెక్టర్ ఆదేశించారు.. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతానికి సంబంధించిన నివేదికలను పంపాలని కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ నిర్వహణలో ఎక్కడ పొరపాట్లు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు..అనంతరం అందరు ఆర్వోలతో ఈ అంశాల మీద వివరాల అడిగి తెలుసుకున్నారు. టెలికాన్ఫరెన్స్ లో ఆర్వోలు, ఏ ఆర్ ఓ లు, నోడల్ అధికారులు, సెక్టర్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.