వెల్దుర్తి మండలంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఓటు హక్కును వినియోగించుకున్న వెల్దుర్తి మండల ప్రజలు
58 పోలింగ్ కేంద్రాల్లో 50956 మంది ఓటర్లు
దాదాపుగా 76.77 శాతం పోలైన ఓట్లు
ఎన్నికల్లో విధులు నిర్వహించిన పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్
విద్యుత్ కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్న విద్యుత్ ఏఇ రాఘవేంద్రప్రసాద్
కర్నూలు ప్రతినిధి / పత్తికొండ/ వెల్దుర్తి, మే 13, (సీమకిరణం న్యూస్):
వెల్దుర్తి మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లోని పోలింగ్ కేంద్రాల్లో సోమవారం జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పలుచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడంతో స్త్రీలు, పురుషులు ఒకేసారి ఓట్లు వేసేందుకు క్యూలో నిల్చుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంతో కాస్తా ఇబ్బందులు పడ్డారు. మరికొన్ని చోట్ల వృద్ధులను పోలింగ్ కేంద్రాల వద్దకు ఓట్లు వేయించేందుకు ఎత్తుకొని వచ్చారు. వెల్దుర్తి మండలంలోని 58 పోలింగ్ కేంద్రాల్లో 50956 మంది ఓటర్లు ఉన్నారు. దాదాపుగా 76.77 శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద బిఎల్ ఓ , వైద్య సిబ్బంది విధులు నిర్వహించారు. ఓటర్లకు మౌలిక వసతులు కల్పించారు. త్రాగు నీటిని ఏర్పాటు చేశారు. అల్లుగుండు, వెల్దుర్తిలోని కొన్ని పోలింగ్ కేంద్రాలను మోడల్ పోలింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్ది రెడ్ కార్పెట్లు పరచి, బెలూన్లతో ఓటర్లను స్వాగతం పలికారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు అధికారులు, సిబ్బంది, బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎన్నికల అధికారులైన మండల తహశీల్దార్ అనంత ఆచారి, ఎంపిడిఓ శివ శంకరప్ప, ఇఓఆర్జీ నరసింహులు, ఏఓ అక్బర్ష. ఎంఇఓ ఇందిర తదితరులు ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. విద్యుత్ ఏఇ రాఘవేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో విద్యుత్ కు అంతరాయం లేకుండా సిబ్బంది చర్యలు తీసుకున్నారు.