ప్రతి గ్రామంలో ప్రశాంత శాంతియుత వాతావరణం ఉండాలన్నదే లక్ష్యం
ఎన్నికల ఫలితాల అనంతరం అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవు
ఇరు పార్టీల రాజకీయ నాయకులు, కార్యకర్తలు శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి
వెల్దుర్తి సీఐ సురేష్ కుమార్ రెడ్డి, వెల్దుర్తి ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి
కర్నూలు క్రైమ్/ వెల్దుర్తి, మే 31, (సీమకిరణం న్యూస్) :
ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా ప్రతి గ్రామంలో ప్రశాంత శాంతియుత వాతావరణం ఉండాలన్నదే లక్ష్యమని వెల్దుర్తి సీఐ సురేష్ కుమార్ రెడ్డి, వెల్దుర్తి ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డిలు తెలిపారు. శుక్రవారం వెల్దుర్తి పోలీస్ స్టేషన్ లోని ఆవరణలో వెల్దుర్తి సీఐ సురేష్ కుమార్ రెడ్డి, వెల్దుర్తి ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డిలు వెల్దుర్తి మండలంలోని వివిధ రాజకీయ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరు పార్టీల రాజకీయ నాయకులు, కార్యకర్తలు శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు. ఫలితాలు వెలువడిన తర్వాత గెలిచిన అభ్యర్థులు బాణాసంచా కాల్చడం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం నిషేధమని తెలిపారు.
వెల్దుర్తి మండలంలోని రాజకీయ నాయకులు వారి కార్యకర్తలను ఎలాంటి గొడవలకు పాల్పడకుండా ముందస్తు సమాచారం ఇవ్వాలని, గ్రామంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు మెలగాలని, గెలిచిన వారు బాణసంచా కాల్చి సంబరాలు ర్యాలీలు ఊరేగింపులు చేయకూడదని, ఓడిన వారు సంయమనం పాటించాలని కోరారు. ఇరు పార్టీల రాజకీయ నాయకులు, కార్యకర్తలు పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. ఎన్నికల రోజు పోలీస్ శాఖకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఇదే సహకారాన్ని కౌంటింగ్ రోజు మరియు మరుసటి రోజు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.