మూడు దశాబ్దాల అనంతరం…
నెల్లూరు సిటీలో ఎగిరిన టీడీపీ జెండా
– విజయకేతనం ఎగురవేసిన డాక్టర్ పొంగూరు నారాయణ
– 72,489 ఓట్ల మెజార్టీతో నెల్లూరు నగర శాసనసభ్యులుగా గెలుపు
– నారాయణ వైపే మొగ్గుచూపిన నెల్లూరు నగర ఓటర్లు
– కలిసి వచ్చిన నారాయణ అభివృద్ధి మంత్రం
– వరంగా మారిన వైసీపీ అసమ్మతి
– ఇక వైసిపి కోటకు బీటలే
– ఆనందోత్సవాల్లో కూటమి శ్రేణులు, నెల్లూరునగర ప్రజలు
– ప్రజా నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చిన డాక్టర్ పొంగూరు నారాయణ
నెల్లూరు నగర నియోజకవర్గంలో మూడు దశాబ్దాలు అంటే 30 సంవత్సరాల చరిత్రను డాక్టర్ పొంగూరు నారాయణ తిరగరాశారు. ప్రజాధరణతో కనీవినీ ఎగురని రీతిలో 72,489 ఓట్ల ఆధిక్యతతో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ జెండా రెపరెపలాడింది. డాక్టర్ పొంగూరు నారాయణ భారీ విజయం సొంతం చేసుకున్నారు. ప్రజలంతా నారాయణ అభివృద్ధి మంత్రం వైపే మొగ్గుచూపారు. దానికి తోడు టీడీపీ జనసేన, బీజేపీ శ్రేణుల సంపూర్ణ మద్దతు కలిసివచ్చింది. ఇదిలాఉంటే వైసీపీలో నెలకొన్న అసమ్మతి కూడా డాక్టర్ పొంగూరు నారాయణకు ప్లస్ పాయింట్ అయింది. దీంతో విజయం వచ్చి నారాయణ చెంత చేరింది. దాదాపు మూడు దశాబ్ధాల అనంతరం నెల్లూరు సిటీలో టీడీపీ జెండా రెపరెపలాడింది. ఫలితంగా నెల్లూరు సిటీ ఇక అభివృద్ధి మయమేనని ఇటు పార్టీల శ్రేణులు, ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆనందోత్సవాల్లో కూటమి శ్రేణులు
2024 సార్వత్రిక ఎన్నికల్లో….మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ 72,489 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడంతో కూటమి శ్రేణులు సంబరాలు చేశారు. తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి షేక్ ఖలీల్ అహ్మద్ పై…పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నుంచి ప్రతీ రౌండ్‌లోనూ నారాయణ ముందంజలో ఉన్నారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొంది… ఎమ్మెల్యేగా శాసన సభలో ఆయన అడుగు పెట్టనున్నారు. ప్రధానంగా ఈ విజయానికి 2014 నుంచి 2019 వరకు ఆయన చేసిన అభివృద్ధే కారణమని సంతోషం వ్యక్తం చేశారు. నారాయణ విజయకేతనంతో… అటు కుటుంబ సభ్యులు..ఇటు టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. టీడీపీ కార్యాలయాలు, నారాయణ క్యాంప్ కార్యాలయంలో టీడీపీ నేతలు, మహిళలు నృత్యాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. నెల్లూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేయడంతో… టీడీపీ నేతల ఆనందానికి అవదుల్లేవ్.
ప్రజా నమ్మకాన్ని నిలబెట్టుకుంటా – డాక్టర్ పొంగూరు నారాయణ
2024 సార్వత్రిక ఎన్నికల్లో తనపై నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. ఫలితాల వెల్లడి అనంతరం డిక్లరేషన్ ఫారం అందుకున్న ఆయన కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కాలేజీ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో…72,489 ఓట్లతో విజయం సాధించడం జరిగిందన్నారు. మొత్తం ఓట్లు 2 లక్షలా 39వేలు అని…అందులో లక్షా 72వేల ఓట్లు పోల్ అయ్యాయన్నారు. అంటే 42 శాతం ఓటింగ్ పోలైందని…ఇది నెల్లూరు సిటీ చరిత్రలో ఇప్పటి వరకు లేదన్నారు. ఇంత భారీ విజయాన్ని అందించిన నెల్లూరు సిటీ ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిజేస్తున్నానని.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. నెల్లూరుసిటీలోని సమస్యలన్నింటిని పూర్తి చేస్తానన్నారు. అదే విధంగా 2014 నుంచి 2019 వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని…కొన్ని మిగిలిపోయాయని…వాటిని వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకుండా వదిలేసిందన్నారు. ఈ ఐదేళ్లలో ఒక్క వర్క్ కూడా పెండింగ్ లో లేకుండా పూర్తి చేస్తానన్నారు. జగన్ అరాచక పాలన కారణంగానే…ఈ ఎన్నికల్లో వైసీపీని ప్రజలు సింగిల్ డిజిట్‌కే పరిమితం చేశారన్నారు. గత ఐదేళ్లులో రాష్ట్రంలో పాలన సర్వనాశనం చేశాడన్నారు. టీడీపీ విజయానికి కార్యకర్తలు ఎంతో శ్రమించారన్నారు. అందుకోసమే కార్యకర్తలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే నా కుటుంబ సభ్యులంతా కలిసి ఏడాదికి వారి సంక్షేమానికి రూ. 10 కోట్లను ఖర్చు చేస్తున్నామన్నారు.
ఫలించిన నారాయణ అభివృద్ధి మంత్రం
నెల్లూరు నియోజకవర్గం 2014 నుంచి వైసీపీకి కంచుకోటగా ఉండేది. 2014, 2019లో పోలుబోయిన అనీల్ కుమార్ వైసిపి పార్టీ తరఫున విజయం సాధించారు. అయితే ఈ దశాబ్దం కాలంలో అభివృద్ధి కుంటుపడింది. 2014లో మంత్రి పదవి చేపట్టిన డాక్టర్ పొంగూరు నారాయణ వేలాది కోట్ల రూపాయలు నిధులతో నియోజవర్గం ముఖచిత్రం మారేలా అభివృద్ధి పనులు చేపట్టారు. 2024 ఎన్నికల ప్రచారంలో డాక్టర్ పొంగూరు నారాయణ ప్రతి నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ తన ఆలోచనలను ప్రజలతో పంచుకున్నారు. అభివృద్ధి మంత్రాన్ని ప్రజలకు వినిపించారు. దీంతో నియోజకవర్గంలో ఏ డివిజన్‌లో ప్రచారానికి వెళ్లినా ఓటర్లు నారాయణ అభివృద్ధికి జేజేలు పలుకుతూ ఆయన వెంట నడిచారు. ఓ వైపు తెలుగుదేశం బలం.. మరో వైపు నారాయణ అభివృద్ధి మంత్రం వెరసి వైసిపి కోటను బద్దలు కొట్టేలా నారాయణ వైపు ఓటర్లు అధిక శాతం నిలబడ్డారని… అదే నారాయణ గెలుపునకు సోపానమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్యనేతలంతా నారాయణ గెలుపును తమ గెలుపుగా భావించి.. వారి వర్గీయులు పూర్తి అండదండలు అందించారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమిగా కలవడంతో నియోజవర్గంలో ఆ పార్టీ ఓటర్ల ఓట్లంతా మూకుమ్మడిగా నారాయణ వైపు నిలబడ్డారని రాజకీయ పరిశీలకులు తెలియజేస్తున్నారు.
1998లో రాజకీయ ఆరంగేట్రం
డాక్టర్ పొంగూరు నారాయణకు 1998లో టీడీపీ అధినేత నారా చంద్రబాబుతో పరిచయం రాజకీయాల వైపు తిప్పింది. తొలుత టీడీపీ సర్వే విభాగానికి తన మేధోశక్తిని వినియోగించిన నారాయణ క్రమంగా క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేశారు. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష పాత్రకే పరిమితం అయిన టీడీపీ వెన్నంటి ఆయన చేసిన సేవలు కొద్ది మందికే తెలుసు. అయితే కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలవడంతో పాటు ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే నారాయణ తపన, పట్టుదల చూసి ఆయన్ని చంద్రబాబు కూడా ఎంతగానో ప్రోత్సహించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడంతో చంద్రబాబు తన మంత్రివర్గంలో డాక్టర్ నారాయణకు స్థానం కల్పించారు. కొత్త రాష్ట్రం అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడంలో కూడా నారాయణకు భాగస్వామ్యం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖలతో పాటు నూతన రాజధాని అమరావతి నిర్మాణంలోనూ నారాయణ కీలక పాత్ర పోషించారు.
మూడు దశాబ్ధాల తర్వాత నెల్లూరు సిటీలో టీడీపీ జెండా రెపరెపలు
1994లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు నియోజకవర్గం నుంచి తాళ్లపాక రమేష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి ఆ పార్టీ ఆవిర్భావ అనంతరం రెండవ విజయాన్ని నమోదు చేశారు. అనంతరం నియోజకవర్గాల విభజన జరిగింది. ఈ క్రమంలో మూడు దశాబ్ద కాలాల తర్వాత నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి తొలిసారిగా తెలుగుదేశంపార్టీ నుంచి డాక్టర్ పొంగూరు నారాయణ విజయకేతనం ఎగురవేశారు. నియోజకవర్గ ప్రజలంతా నారాయణ వైపే మొగ్గుచూపారు. డాక్టర్ పొంగూరు నారాయణ అభివృద్ధి మంత్రానికి ఆకర్షితులై పలువురు నేతలు తండోపతండాలుగా వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. దీనికి తోడు వైసీపీలో పొరపచ్చాలు కూడా నారాయణకి లాభించాయి. ఫలితంగా నెల్లూరు సిటీ శాసనసభ్యులుగా డాక్టర్ పొంగూరు నారాయణ విజయం సుసాధ్యమైంది.
ఆనందోత్సవాల్లో నెల్లూరు నగర ప్రజలు, పార్టీల శ్రేణులు
నెల్లూరు నగర శాసనసభ్యులుగా డాక్టర్ పొంగూరు నారాయణ 72,489 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడంతో నగర ప్రజలు, కూటమి పార్టీల శ్రేణులతో పాటు రాష్ట్రంలోని అభిమానులంతా ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. తమ నేత నారాయణ గెలుపుతోనే రాష్ట్రంతో పాటు నెల్లూరు నగరం అభివృద్ధి చెందుతుందని వారంతా ఆశాభావం వ్యక్తం చేశారు. కేక్‌లు కట్ చేసి మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.