కడప చరిత్రను తిరగరాసిన మాధవి రెడ్డి
కడప నియోజకవర్గ తొలి మహిళా ఎమ్మెల్యేగా గుర్తింపు..!
కడప రెడ్డెమ్మకు మంత్రి పదవిపై కడప నియోజకవర్గ ప్రజల ఆశలు!
కడప బ్యూరో, జూన్ 12, (సీమకిరణం న్యూస్):
ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు మాధవి రెడ్డి మెట్టినింట కాలుపెట్టిన తరువాత రెడ్డెప్పగారి మాధవి రెడ్డి అయింది! అయితే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల ప్రచారంలో కడపకు విచ్చేసినప్పుడు అభిమానంతో మాధవి రెడ్డి గారికి పెట్టిన పేరు కడప రెడ్డెమ్మ! మాధవి రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొని 2024 శాసనసభ ఎన్నికల్లో మొదటిసారిగా కడప నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 18,860 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మాధవి రెడ్డి గారి మామ గారైన ఆర్.రాజగోపాల్ రెడ్డి లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా పనిచేశారు. మాధవి రెడ్డి గారి భర్త శ్రీనివాస రెడ్డి వృత్తి రీత్యా కాంట్రాక్టర్ అయినప్పటికీ ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నారు 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేశారు. కడప నియోజకవర్గ చరిత్రను గనుక ఒక్కసారి పరిశీలిస్తే 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1952 సంవత్సరంలో తొలిసారి జరిగిన కడప అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (భారత జాతీయ కాంగ్రెస్) పార్టీ తరపున పోటీ చేసిన కడప కోటి రెడ్డి విజయం సాధించారు. 1955 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి షైక్ మహమ్మద్ రహమతుల్లా విజయం సాధించారు. 1962 లో ఇండిపెండెంట్ (స్వంతంత్ర) అభ్యర్థి పుల్లగూర శేషయ్య గెలుపొందారు. 1967 లో షైక్ మహమ్మద్ రహమతుల్లా రెండవసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 1972 మరియు 1978 ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గజ్జల రంగారెడ్డి విజయం సాధించారు. 1983 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిరిగిరెడ్డి రామముని రెడ్డి విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన పరిణామాలలో ఇందిరాగాంధీ ఎన్.టి.రామారావు గారిని బర్తరఫ్ చేసి నాదెండ్ల భాస్కరరావు గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. ఆ సమయంలో టీడీపీలో గెలిచిన రామముని రెడ్డి ఇందిరా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న అల్లర్లను దృష్టిలో పెట్టుకొని ఇందిరాగాంధీ 1985లో మళ్ళీ ఎన్.టి.రామారావు గారిని ముఖ్యమంత్రిని చేసినప్పటికీ ఎన్.టి.రామారావు ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాడు. 1985 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెన్నంశెట్టి రామచంద్రయ్య విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి కందుల శివానంద రెడ్డి విజయం సాధించారు. 1994 మరియు 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎస్.ఏ.ఖలీల్ బాషా విజయం సాధించారు. 2004 మరియు 2009 ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే రహమతుల్లా గారి కుమారుడు షైక్ మహమ్మద్ అహమ్మదుల్లా గారు విజయం సాధించారు. 2014 మరియు 2019 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షైక్ బేపారి అంజాద్ బాషా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో కడప రెడ్డెమ్మ అలియాస్ రెడ్డెప్పగారి మాధవి రెడ్డి విజయం సాధించారు. 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు కడప నియోజకవర్గ చరిత్రలో ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా మహిళా అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదు. మొదటిసారిగా మాధవి రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందడం ఒక చరిత్ర అని చెప్పవచ్చు! ఇంకొక విషయం ఏమంటే 1994 నుండి అంటే గత 30 సంవత్సరాలుగా ముస్లిం అభర్ధులే ఇక్కడ విజయం సాధించారు 30 సంవత్సరాల తరువాత ఒక హిందూ మహిళ విజయం సాధించడం దానికితోడు ముస్లిం ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో మాధవి రెడ్డి గారిని అభిమానించి పట్టం కట్టడం విశేషం! 1999 ఎన్నికల్లో ఖలీల్ బాషా గారి గెలుపు తరువాత 2024 వరకూ తెలుగుదేశం పార్టీ 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలైంది. 20 సంవత్సరాల తరువాత కడప నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం తెలుగుదేశం పార్టీ అభిమానుల్ని ఆనందడోలికల్లో ముంచేసింది. 20 సంవత్సరాల తరువాత తెలుగుదేశం పార్టీ జెండాను కడప నియోజకవర్గంలో రెపరెపలాడించిన కడప రెడ్డెమ్మ అలియాస్ రెడ్డెప్పగారి మాధవి రెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చి మాధవి రెడ్డి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.