ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే
పంట రుణమాఫీకి విధివిధానాలు రూపొందించండి
ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే
పూర్తి డేటా సేకరించి, ప్రణాళిక సిద్ధం చేయండి
అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ :
రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. పంట రుణమాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.2లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని తెలిపారు. కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా, పీఏసీఎస్ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు పూర్తి స్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు.