తొలిసారి లోకసభలో గళం విప్పిన కర్నూలు ఎంపీ
జిల్లాలోని సమస్యలను వివరించి, అభివృద్ధికి సహకరించాలని కోరిన ఎంపీ
కర్నూలు ప్రతినిధి, జూలై 25, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు లోక్ సభలో తొలిసారి తన గళాన్ని వినిపించారు. మొదటి ప్రసంగంలోనే జిల్లాలోని సమస్యలను వివరించి, జిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మాట్లాడిన ఆయన మొదటగా తాను పార్లమెంట్ లో నిల్చుని మాట్లాడేందుకు కారణమైన సీ.ఎం. చంద్రబాబు, లోకేష్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ విప్లవాత్మకమైన బడ్జెట్ అని , బడ్జెట్లో కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నీ గుర్తించి నిధులు కేటాయించారన్నారు. ప్రధానంగా రాజధాని అమరావతి, ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు తో పాటు , వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలతో పాటు ప్రకాశం జిలాలకు ప్రత్యేజ ప్యాకేజీ కి, ఏ.పి లో నీరు, విద్యుత్ , రైల్వే, రోడ్లు, ప్రాజెక్టులకు నిధులు ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇక బడ్జెట్ పై విపక్ష పార్టీ నేతలు ఆంధ్ర, బీహార్ బడ్జెట్ అని విమర్శిస్తున్నారని, గత ఐదేళ్ల జగన్ విధ్వంస పాలనలో రాష్ట్ర సర్వ నాశనం అయిందని, కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా పాలన సాగిందన్న విషయాన్ని అందరూ గుర్తించుకోవాలన్నారు.. వైసీపీ ప్రభుత్వం కేంద్ర నిధులతో పాటు, రాష్ట్ర నిధులను నవరత్నాలకు ఉపయోగించి రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేసిందని, దీన్ని గుర్తించే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వడం జరిగిందన్నారు.. అనంతరం కర్నూలు పార్లమెంట్ గురించి మాట్లాడిన ఎం.పి నాగరాజు రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ల కంటే కర్నూలు పార్లమెంట్ అత్యంత వెనుకబడిందన్నారు. కర్నూలు జిల్లా కరువు , వలసలు నిలయంగా మారిందన్నారు. సరైన నీటి వసతులు లేక పంటలు పండక ప్రతి ఏడాది కరువు సంభవించి ఇక్కడి రైతులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే దుస్థితి తలెత్తుతుందని, అలాగే పరిశ్రమలు లేక యువతకు ఉపాధి , ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కర్నూలు జిల్లా పై దృష్టి సారించి వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులు , జాతీయ రహ దారులు నిర్మించడం తో పాటు, పరిశ్రమలు నెలకొల్పాలని, అలాగే కర్నూలు ప్రభుత్వాసుపత్రిని ఎయిమ్స్ తరహాలో తీర్చిదిద్ధి జిల్లా అభివృద్ధికి సహకరించాలని శిరస్సు వంచి కోరుకుంటున్నానని ఆయన తెలిపారు.