రహదారులపై ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి
కర్నూలు నగరంలో ట్రాఫిక్ రద్దీకి యాక్షన్ ప్లాన్ రూపొందించండి
కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా
కర్నూలు ప్రతినిధి, జూలై 25, (సీమకిరణం న్యూస్) :
రహదారులపై ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా రహదారి భద్రతా సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారులపై 51 బ్లాక్ స్పాట్స్ గుర్తించడం జరిగిందని, ఆ ప్రాంతాలలో ప్రమాదాల నివారణకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని నేషనల్ హై వే, ఆర్ అండ్ బి, పంచాయితీ రాజ్ శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలుగా గుర్తించిన 52 ప్రాంతాలలో కూడా ప్రమాదాలు నివారించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు అవుతున్నందున ఓర్వకల్ ఎయిర్పోర్ట్ వద్ద వీలయితే అండర్ పాస్ లేదా అప్రోచ్ రోడ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ఎన్ హెచ్ ఎ ఐ 40 అధికారులను ఆదేశించారు.. ఈ అంశంపై మాట్లాడేందుకు తగిన పరిష్కారం తో ఎన్ హెచ్ ఎ ఐ 40 పిడి తన వద్దకు రావాలని కలెక్టర్ సంబంధిత అధికారికి సూచించారు. ఈ అంశంపై డిఓ లేఖను కూడా సిద్ధం చేయాలని కలెక్టర్ డిటిసిని ఆదేశించారు. నన్నూరు హౌసింగ్ కాలనీ నుండి డైరెక్ట్ గా రోడ్ ఉన్నందున అలా కాకుండా అవసరమైన సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. ఎల్లమ్మ గుడి దగ్గర ట్రాఫిక్ ను నియంత్రణ ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సమస్య అని ఇది జెన్యూన్ సమస్య అని, ఈ సమస్యకు తగిన పరిష్కారం లభించేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. కర్నూలు నగరంలో ట్రాఫిక్ రద్దీకి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.. బళ్లారి చౌరస్తా,హాస్పిటల్, రాజ్ విహార్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీకి గల కారణాలను కలెక్టర్ అధికారులతో చర్చించారు..స్ట్రీట్ వెండర్స్ కు,ఆటో స్టాండ్ ఏర్పాటు గల ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణంలో కొంత స్థలాన్ని గుర్తించి ఆటో స్టాండ్ ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉందా పరిశీలించాలన్నారు…ఆసుపత్రి వైపు ఉన్న రోడ్డును వెడల్పు చేయగలమా, ఆసుపత్రి కాంపౌండ్ వాల్ లోపలికి నిర్మించి ఒక ఆటో స్టాండ్, స్ట్రీట్ వెండార్స్ జీవనాధారం కోసం దుకాణాలు ఏర్పాటు అంశాలపై అదనపు మున్సిపల్ కమీషనర్, ట్రాఫిక్ పోలీసు అధికారులు ఆసుపత్రి సూపరింటెండెంట్ తో చర్చించాలన్నారు. కలెక్టరేట్ నుంచి ఆసుపత్రికి వెళ్లే దారిలో గేదెలు, ఆవులు ఉంటున్నాయని, అలా ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ చాలా స్థలం ఆక్రమించాయని, వాటిని తగ్గించే అవకాశం ఉందా పరిశీలించాలన్నారు.. సి క్యాంపు సెంటర్లో ఆర్టీసీ బస్సులను రోడ్డు మధ్యలో ఆపుతున్నారని, అలా జరగకుండా డ్రైవర్లకు తగిన సూచనలు ఇవ్వాలని కలెక్టర్ ఆర్టీసీ ఆర్ఎం ను ఆదేశించారు. రాజ్ విహార్, హాస్పిటల్, మద్దూర్ నగర్ తదితరచోట్ల బస్ స్టాప్ లు సర్కిల్స్ కు దగ్గరగా ఉండడం వల్ల రద్దీ ఎక్కువగా ఉంటోందని, వీటిని కొద్దిగా జరిపి ముందుకు పెట్టే అవకాశముందేమోనని పరిశీలించాలని కలెక్టర్ ఆర్ టి సి ఆర్ ఎం ను ఆదేశించారు. ట్రాఫిక్ రద్దీ తగ్గేందుకు వీలుగా రాజ్ విహార్ సమీపంలో ఉన్న పాత డిపో నుండి నందికొట్కూరు, నంద్యాల బస్సులు తిరిగే అంశాన్ని కూడా పరిశీలించాలని కలెక్టర్ ఆర్ టి సి ఆర్ ఎం ను ఆదేశించారు. నగరంలో పనిచేయని సీసీ కెమెరాల స్థానంలో కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. నగరంలోకి లారీలు, భారీ వాహనాలు నిర్దిష్టమైన సమయంలో అనుమతించేలా తగిన ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ అంశాలన్నింటిపై యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. డిటిసి, మున్సిపల్ కమిషనర్ ట్రాఫిక్ సిఐ, ఆర్ అండ్ బి ఎస్ ఈ, నేషనల్ హైవేస్ పిడి లు నలుగురితో కమిటీ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు..నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి తీసుకోవలసిన చర్యలు, జంక్షన్ ఇంప్రూవ్మెంట్, కరెంట్ పోల్ షిఫ్టింగ్, రోడ్ల విస్తరణ, మ్యాన్ హోల్స్ తదితర అంశాలపై సర్వే నిర్వహించి కమిటీ తగిన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు.సబ్ కమిటీ ట్రాఫిక్ రద్దీ నియంత్రణ తో పాటు ఆర్థిక అవసరం లేని పనులన్నీ చేసేలా చర్యలు తీసుకోవాలని, ఆర్థిక అవసరాలతో ముడిపడిన పనులకు సంబంధించి అన్ని శాఖలు తగిన అంచనాలతో నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి 15 రోజులలోపు కేసు వెరిఫై చేసి రిపోర్ట్ను అందజేస్తే 2 లక్షల బీమా అందుతుందని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ పోలీసు రవాణా శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రహదారులపై ప్రమాదాలు, తీసుకోవలసిన చర్యలపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహిస్తామని, వచ్చే సమావేశానికి సమగ్రమైన వివరాలతో రావాలని పోలీసు, రవాణా శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ మాట్లాడుతూ నగరంలో చాలా చోట్ల సిసి కెమెరాల్లో విజువల్స్ సరిగ్గా కనపడం లేదని, దొంగతనాలను కనిపెట్టేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమని తెలిపారు. రహదారులపై ప్రమాదాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీధర్ రహదారి భద్రతా సమావేశానికి సంబంధించిన అజెండా అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో అదనపు మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వర్, ఆర్ అండ్ బీ ఎస్ఈ నాగరాజు, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, అదనపు డిఎంహెచ్ఓ భాస్కర్, ట్రాఫిక్, పంచాయతీ రాజ్, ట్రాఫిక్ పోలీసు సీఐ తదితరులు పాల్గొన్నారు.