వైద్య కేంద్రంగా కర్నూలు
-: అశ్విని వైద్యశాల ప్రారంభోత్సవంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్
కర్నూలు ప్రతినిధి, జూలై 31, (సీమకిరణం న్యూస్) :
రాయలసీమ జిల్లాల్లో వైద్య రంగానికి కర్నూలు కేంద్రంగా మారుతుందని, మరో కార్పొరేట్ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి రావడం హర్షించదగ్గ విషయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. బుధవారం ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన అశ్విని హాస్పిటల్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ గతంలో మెరుగైన వైద్య సేవల కోసం కోసం ఇతర మెట్రో నగరాలకి వెళ్లాల్సిన అవసరం వచ్చేదని, ఆ అవసరం లేకుండా ఇక్కడే ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ రావడంతో, అన్ని రకాల వైద్య సేవలు కర్నూలుకు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. సీనియర్ వైద్యులు శ్రీనివాస్ రెడ్డి మొదటినుంచి కూడా సేవా భావం కలిగిన వ్యక్తిని, అటువంటి వ్యక్తి ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆధునిక వసతులతో హాస్పిటల్ నిర్మించడం అభినందనీయమన్నారు. అలాగే ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా వివిధ విభాగాలలో నిష్ఠాత్తులైన డాక్టర్లు కనక 24 గంటలు ఉత్తమ వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నానని టీజీ వెంకటేష్ అన్నారు. ఇటువంటి హాస్పిటల్స్ నిర్మాణం వల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు, మరి ఎంతో మందికి వివిధ రకాలుగా ఉపాధి కూడా లభిస్తుందన్నారు. కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, టిడిపి నేత గౌరు వెంకట్ రెడ్డి, పారిశ్రామిక వేత్త బీవీ రెడ్డి, విశ్వహిందూ పరిషత్ నాయకులు నందిరెడ్డి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.