ఎస్సీ ఎస్టీలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు
జిల్లాల్లో దళితులకు ఎక్కడా అన్యాయం జరగరాదు
అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించాలి
రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఛామకూరి
రాయచోటి, ఆగస్టు 02, (సీమకిరణం న్యూస్):
జిల్లాలో ఎస్సీ ఎస్టీలపై అన్యాయంగా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాల సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అణగారిన వర్గాలలో జరుగుతున్న అన్యాయాలపై రాజ్యాంగ విలువలు, హక్కులను కాపాడేందుకు కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు. సమాజంలో ఏమి జరుగుతోంది ఎటువంటి అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి అనే కేసుల పరిస్థితి తదితరాలపై కూడా కమిటీ సభ్యులు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఎస్సీ ఎస్టీ ల గ్రామాల వివరాలు సేకరించి అక్కడ జరుగుతున్న అన్యాయాలపై ప్రత్యేక చర్యలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించి దళితులకు ఎక్కడా అన్యాయం చోటు చేసుకోకుండా చూడాలన్నారు. జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా అధికారులు పారదర్శకంగా, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి సంబందించిన కేసులలో బాధితులకు న్యాయంతో పాటు త్వరితగతిన పరిహారం అందించేందుకు చర్యలు తీసు కుంటామని మంత్రివర్యులు తెలిపారు. వారికి సంబంధించిన భూ సమస్యలు ఏమైనా ఉంటే వాటిపై ప్రత్యేక దష్టి సారించి త్వరితగతిన పరిస్కరించాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలను కల్పిస్తోందని ఎక్కడ వారు అన్యాయానికి గురి కాకుండా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లపై పోలీసులు ప్రత్యేక దష్టి సారించాలని పోక్సో చట్టం, బాల్య వివాహాలు నిరోధక చట్టం పైన ప్రజల్లో అవగాహన సదస్సులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బాల్య వివాహాలను అరికట్టే చర్యల్లో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ డివిజన్ల వారీగా ఆర్‌డిఒలు, డిఎస్‌పిలు మండల స్థాయి అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంచాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ పోలీస్, రెవెన్యూ, ప్రాసిక్యూషన్ విభాగాలు సమన్వయంతో పనిచేసి ఎస్సీ, ఎస్టీ వర్గాలపై నమోదు అయిన కేసుల్లో జాప్యాన్ని నివారించి సత్వర న్యాయం అందించాలన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో భాగంగా ఎటువంటి సంఘటనలు జరిగిన వెంటనే పోలీసులు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు.ఎఫ్ఐఆర్ కాగానే బాధితులకు పరిహారం అందజేస్తున్నట్లు చూడాలన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా పోలీసులతోపాటు సంబంధిత శాఖల అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. కేసులలో ఎప్పటి కప్పుడు ఛార్జిషీట్ దాఖలు చేయడంతో పాటు నిర్ణీత సమయంలోగా కేసులను పూర్తిచేయాలన్నారు. బాధితులకు ప్రభుత్వం తరపున ఆర్ధిక సహాయం సకాలంలో అందేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ బాలికల ఆశలలో వేడి నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, మదనపల్లి, రాజంపేట సబ్ కలెక్టర్ లు మేఘ స్వరూప్, నదియా, డిఆర్ఓ సత్యనారాయణ, రాయచోటి ఆర్డీఓ రంగస్వామి, డిఎస్పీలు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామసుబ్బయ్య, జిల్లా ఎస్టీ సంక్షేమ అధికారులు, జిల్లా నిఘా కమిటీ సభ్యులు తదితరులు హాజరయ్యారు.