పేదింటి బాలిక – స్వర్ణ పతక విజేత
పేదింటి బాలిక- స్వర్ణ పతక విజేత
గుంటూరు జిల్లా, రెంటచింతల, మార్చి 14, (సీమకిరణం న్యూస్) :
రెంటచింతల మండలంలోని పశర్లపాడు గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబ విద్యార్థిని చింతమళ్ల తేజస్విని పేదింటి పిల్ల అయినా ప్రతిభలో సంపన్నురాలుగా నిలిచి పల్నాటి గడ్డకు గర్వకారణమైంది. విజయవాడలో రాష్ట్రస్థాయి రైజ్లింగ్ పోటీల్లో ఆమె పాల్గొని స్వర్ణ పతకం సాధించింది.అండర్-17 బాలికల విభాగంలో 73 కేజీల విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా నిలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. తల్లిదండ్రులు సుబ్బారావు, కుమారిలు తమ బిడ్డ చదువు, క్రీడల్లో చూపుతున్న ప్రతిభను చూసి మురిసిపోతున్నారు. తేజస్విని ప్రస్తుతం సాగర్ లోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల గుంటూరు జిల్లా స్థాయిలో జరిగిన రెజ్లింగ్ పోటీల్లో కూడా తేజస్విని స్వర్ణ విజేతగా నిలిచి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైంది. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన పల్నాటి బిడ్డ తేజస్విని ప్రతిభను పలువురు ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు హర్షిస్తూ పల్నాటికే గర్వ కారణమంటున్నారు.