రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించండి
కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
వెల్దుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్
కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 21, (సీమకిరణం న్యూస్):
రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా వైద్యాధికారులకు సూచించారు. బుధవారం వెల్దుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా ఆసుపత్రిలోని జనరల్ మేల్ వార్డును పరిశీలిస్తూ జ్వరంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన బాలుని తల్లి తో మాట్లాడారు. ఆసుపత్రిలో ఎప్పుడూ అడ్మిట్ అయ్యారు? ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారు? సరైన సమయానికి మందులు ఇస్తున్నారా? లేదా? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య శ్రీ రిజిస్టర్ ను కలెక్టర్ పరిశీలిస్తూ, ఆరోగ్యశ్రీ కింద ఇప్పటివరకు ఎంతమంది రిజిస్టర్ అయ్యారు? ఈరోజు ఎంతమంది రిజిస్టర్ అయ్యారనే వివరాలను ఆరోగ్యశ్రీ మిత్రను అడిగి తెలుసుకున్నారు. డిస్పెన్సరీ (ఫార్మసీ) ను కలెక్టర్ పరిశీలిస్తూ ఎక్స్పైర్ అయ్యే మందుల గురించి 3 నెలలు ముందుగానే డాక్టర్ల దృష్టి తీసుకొని వెళ్లాలని ఫార్మసిస్ట్ ను కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా ఎక్స్పైర్ అయ్యే మందుల వివరాలు, స్టాక్ లో ఉండే మందుల వివరాలను కూడా డిస్ప్లే చేయాలని కలెక్టర్ ఆదేశించారు. యాంటీబయాటిక్స్ ఏవి ఉపయోగిస్తున్నారనే వివరాలను ఫార్మసిస్ట్ ను తెలుసుకున్నారు. ల్యాబ్ ను పరిశీలిస్తూ రోజుకు యావరేజ్ గా ఎన్ని పరీక్షలు నిర్వహిస్తారు? నిర్ధారణ అయిన వాటికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు? కొన్ని వ్యాధులకు ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వటానికి కుదరకపోతే ఎక్కడికి రెఫర్ చేస్తారనే వివరాలను సంబంధిత వైద్య అధికారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. ఫిమేల్ వార్డ్ ను పరిశీలిస్తూ అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్న తులసమ్మ తదితరులతో మాట్లాడుతూ ఏ ఆరోగ్య సమస్య చేత ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు? ఇక్కడ వైద్యం ఏ విధంగా అందిస్తున్నారు? సరైన సమయానికి మందులు ఇస్తున్నారా? ఆస్పత్రిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అనే వివరాలను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు.. అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్న రవికుమార్ కేస్ షీట్ ను కలెక్టర్ పరిశీలించారు. వైద్యశాలకు కరెంట్ బ్యాకప్ కోసం జనరేటర్ ఏర్పాటు చేయించాలని, ఆర్ ఓ వాటర్ సిస్టం ఏర్పాటు చేయించాలని, అదే విధంగా ఒక జనరల్ సర్జన్ విధులకు గైర్హాజరు అయ్యారని అతని స్థానంలో వేరే జనరల్ సర్జన్ ను ఏర్పాటు చేయించాలని వైధ్యాధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వైద్యశాలకు అవసరమైన అంశాలన్నింటినీ రాతపూర్వకంగా ఇవ్వాలని పేపర్ లో ఇవ్వాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిసిహెచ్ఎస్ డా.మాధవి, పిడియాట్రిక్ డాక్టర్ బాలచంద్రారెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.