విద్యార్థులు నిర్ధిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని కష్టపడి చదవాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
వెల్దుర్తిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 21, (సీమకిరణం న్యూస్) :
విద్యార్థులు నిర్ధిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని కష్టపడి చదవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా విద్యార్థినులకు సూచించారు. బుధవారం వెల్దుర్తి మండలం కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని విద్యార్థినులతో మాట్లాడారు. పదవ తరగతి పూర్తైన తర్వాత మీలో ఎంత మంది కలెక్టర్, పోలీసు, డాక్టర్, ఉపాద్యాయ వృత్తుల్లో స్థిరపడాలని అనుకుంటున్నారని కలెక్టర్ ప్రశ్నించారు..కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు.. ప్రతి రోజు స్నాక్స్ ఇస్తున్నారా? మెనూ ప్రకారమే స్నాక్స్ ఇస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. .. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ ఆరా తీశారు.
పాఠశాలలో విద్యార్థినులు ఆడుకోవడానికి సరైన ప్లే గ్రౌండ్, టెన్నిస్ కోర్టు ఉందా? లేదా? అని పాఠశాల ఇంఛార్జి హెడ్ మాస్టర్ ను కలెక్టర్ ఆరా తీశారు.. ప్లే గ్రౌండ్ లేదని ఇంఛార్జి హెడ్ మాస్టర్ కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా వెంటనే ఒక టెన్నిస్ కోర్టును ఏర్పాటు చేయాలని ఇంఛార్జి హెడ్ మాస్టర్ ను కలెక్టర్ అదేశించారు. పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని డిఈఓను కలెక్టర్ అదేశించారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్ఓ వాటర్ ప్లాంట్ నీటిని ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందితో నీటి పరీక్షలు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి హెడ్ మాస్టర్ ను కలెక్టర్ ఆదేశించారు. వంట గదిలో నిల్వ ఉన్న కంది పప్పు ను కలెక్టర్ పరిశీలించి, నాణ్యతగా లేవని, మంచి కందిపప్పును సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెల్దుర్తి తహశీల్దార్ ను ఆదేశించారు. పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న బెంచ్ లను అవసరమైన పాఠశాలకు సర్దుబాటు చేయాలని డిఇఓను కలెక్టర్ ఆదేశించారు. అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి మాట్లాడుతూ తనకు చదువు అంటే చాలా ఇష్టమని, నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకొని నిరంతరం కృషి చేసి ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. అదే విధంగా మీరు కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని విద్యార్థినులను మోటివేట్ చేశారు. జిల్లా కలెక్టర్ వెంట డిఈఓ శామ్యూల్, వెల్దుర్తి తహశీల్దార్ చంద్రశేఖర్ శర్మ, ఎంపిడిఓ శివమల్లేశ్వరప్ప, ఇంఛార్జి హెడ్ మాస్టర్ మంజుల, ఎంఈఓ ఇందిర, రమేష్ తదితరులు పాల్గొన్నారు.