వంట నూనెల ధరలు పెంచితే కఠిన చర్యలు
వంట నూనెల ధరలు పెంచితే కఠిన చర్యలు
పరిమితికి మించి నిల్వలు ఉంచరాదు
జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) ఎస్ రామ సుందర్ రెడ్డి
కర్నూలు కలెక్టరేట్, మార్చి 15, ( సీమకిరణం న్యూస్) :
రష్యా – ఉక్రెయిన్ యుద్ధవాతావరణం నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా వంట నూనెల ధరలు పెంచితే కఠినంగా చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) ఎస్ రామ సుందర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనం లో వంట నూనెల ధరల నియంత్రణపై ఆయిల్ మిల్లర్లు, వ్యాపారస్థులతో సమావేశం నిర్వహించారు. ఇన్చార్జి జిల్లా పౌరసరఫరాల అధికారి రాజా రఘువీర్, లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ సుబ్బారెడ్డి, జిఎస్టి డిప్యూటీ కమిషనర్ సత్య ప్రకాష్, ఆహార భద్రతా అధికారి రామచంద్రరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) ఎస్ రామ సుందర్ రెడ్డి మాట్లాడుతూ రష్యా – ఉక్రెయిన్ యుద్ధవాతావరణ నేపథ్యంలో సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు తగ్గిన దృష్ట్యా వంట నూనెల ధరలు ఎంఆర్పి రేట్ల కంటే అధిక ధరలకు విక్రయిస్తే సంబంధిత ఆయిల్ మిల్లర్ల స్టాక్ ట్రేడర్లు, వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ జీవో నెంబర్ 4 ప్రకారం ఎవరైనా వంట నూనెలను ఎక్కువ ధరలకు విక్రయించినా, పరిమితికి మించి నిల్వ ఉంచినా నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. అకారణంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని వ్యాపారస్తులు ఈ విషయంపై ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ, ఆహార భద్రత అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని జెసి ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కంటే అధిక ధరలకు అమ్మినా, పరిమితికి మించి అక్రమ నిల్వలు ఉంచినా సంబంధిత నిల్వలను సీజ్ చేయడంతో పాటు సంబంధిత ఆయిల్ దుకాణాలపై కేసులు కూడా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రీటైలర్ 30 క్వింటాళ్లు, హోల్ సేల్ డీలర్ 500 క్వింటాళ్లు, సూపర్ మార్కెట్ల బల్క్ కన్జ్యూమర్ 1000 క్వింటాళ్లు, ఆయిల్ మిల్లర్లు 90 రోజుల వరకు నిల్వ సామర్థ్యం ఉంచుకోవచ్చని జెసి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయిల్ మిల్లర్ల యజమానులు, హోల్సేల్ డీలర్ లు, రీటైలర్లు, పౌరసరఫరాల శాఖ ఉప తహసీల్దార్లు, ఏఎస్ఓలు తదితరులు పాల్గొన్నారు.