BREAKING NEWSCRIMESTATEWORLD
నకిలీ అధికారుల అరెస్టు
నకిలీ అధికారుల అరెస్టు
-: 7 సెల్ ఫోన్లతో సహా ఐడి కార్డుల స్వాధీనం
కర్నూలు ప్రతినిధి, అక్టోబర్ 19, (సీమకిరణం న్యూస్) :
జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా, నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అధికారులమని బెదిరించిన కేసుకు సంబంధించి ఐదుగురు నకిలీ అధికారులను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఏడు సెల్ ఫోన్లు ఐడి కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు డి.ఎస్.పి.బాబు ప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఓర్వకల్లు పోలీస్ స్టేషన్లో ఎస్సై సునీల్ కుమార్, సిఐ చంద్రబాబు నాయుడులతో కలిసి డీఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో నన్నూరు రాగ మయూరి కాలనీలో నివాసం ఉంటున్న గంగాధర్, శ్రీనివాసులు వద్ద పని చేస్తున్న పెద్ద దర్గయ్యల ఇంటి వద్దకు వెళ్లి మీరు బియ్యం వ్యాపారం చేస్తున్నారన్నారు. అందులో భాగంగా మిమ్మల్ని అరెస్టు చేసేందుకు వచ్చామని నమ్మబలికారన్నారు. ఈ కేసులో మిమ్మల్ని వదిలి పెట్టాలంటే మీరు రూ.2.50 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు చెప్పారు. అయితే వారి నుండి రూ10వేలు తీసుకున్నారు. అంతటితో ఆగకుండా డిఎస్పి కి ఫోన్ చేస్తున్నామని చెప్పి తిరిగి వారు డిమాండ్ చేసిన మొత్తానికి బేరమాడుతుండగా పోలీసుల రాకను గమనించి వారు వచ్చిన వాహనం అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు అన్నారు. ఈ విషయంపై గంగాధర్ ఓర్వకల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్డిపిఓ కర్నూలు.. కర్నూలు రూరల్ సీఐ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారన్నారు. శనివారం నిందితులకు సంబంధించిన స్పష్టమైన సమాచారం రావడంతో మండల పరిధిలోని హుసేనాపురం షఫీ కూల్ డ్రింక్స్ & టీ స్టాల్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గిద్దలూరు మండల పరిధిలోని రాచర్ల గ్రామానికి చెందిన పాలకిటి మధుసూదన్, గిద్దలూరు మండల పరిధిలోని తాళ్లపల్లె గ్రామానికి చెందిన శీలం అంకిరెడ్డి, పాణ్యం మండల పరిధిలోని మద్దూరు గ్రామానికి చెందిన పరదేశి రవి కుమార్ (ప్రజాపబ్లిక్ రిపోర్టర్), నంద్యాల పట్టణానికి చెందిన కొరతల మహేష్ (పోలీస్ డైరీ టీవీ మంత్లీ మ్యాగజైన్ రిపోర్టర్), ఓర్వకల్లు మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన మధులు అరెస్టు చేసిన వారిలో ఉన్నారన్నారు. వారి వద్ద నుండి ఏడు సెల్ ఫోన్లు, ఐడి కార్డులు, రూ:10 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.